అంగరంగ వైభవంగా అయోధ్య రామమందిర విగ్రహా ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న జరగనుంది. ఆ రామునికి దేశ, విదేశాల నుంచి ఎన్నో కానుకలు వచ్చాయి. ఈక్రమంలో సిరిసిల్ల కూడా అయోధ్య రాముడికి ఓ బంగారు చీరను కానుకగా పంపించనున్నారు.
Sircilla: అంగరంగ వైభవంగా అయోధ్య రామమందిర విగ్రహా ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న జరగనుంది. ఆ రామునికి దేశ, విదేశాల నుంచి ఎన్నో కానుకలు వచ్చాయి. ఈక్రమంలో సిరిసిల్ల కూడా అయోధ్య రాముడికి ఓ బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా ఈ బంగారు చీర శ్రీరాముడి పాదాల చెంత ఉంచనున్నారు. అయితే నేతన్న హరిప్రసాద్ నివాసానికి బీజేప జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వెళ్లి బంగారు చీరను పరిశీలించారు.
సిరిసిల్లలో అద్భుతమైన చేనేత కళాకారులు ఉన్నారని ప్రశంసించారు. గతంలో అగ్గిపెట్టేలో పట్టే చీరను తయారు చేసిన ఘనత సిరిసిల్ల జిల్లాకు ఉందని గుర్తు చేశారు. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ చీరను 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో రూపొందించారు. రామాయణ ఇతివృత్తం తెలిపే చిత్రాలతో ఈ చీరను హరిప్రసాద్ తయారు చేశారు.