ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులపై శుక్రవారం మంత్రి సబిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవ సేన, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈనెల 27వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తి షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని సూచించారు. ఎక్కడా అవకతవకలు, అవినీతి జరగకుండా జాగ్రత్తగా పదోన్నతులు, బదిలీలు చేపడతామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ ప్రక్రియపై మంత్రి సబితా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.