»Rs 12000 Crore Medical Seat Scam In The Telangana Private Medical Colleges Ed Raids
Telangana:లో రూ.12,000 కోట్ల మెడికల్ సీట్ల కుంభకోణం!
తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 12 వేల కోట్ల రూపాయల స్కాం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ(ED) అధికారులు పలు కాలేజీలపై సోదాలు నిర్వహించారు. ఏక కాలంలో 15 చోట్ల తనిఖీలు చేపట్టారు. కామినేని గ్రూపు సంస్థల కార్యాలయాలు, పలువురు ప్రముఖులకు చెందిన వైద్య కళాశాలలు, నివాసాలపై ఈడీ బుధవారం దాడులు చేపట్టింది.
తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో మెడికల్ సీట్ల విక్రయాల్లో భాగంగా రూ.12,000 కోట్ల స్కాం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ నేడు(జూన్21న) సోదాలు చేపడుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలువురు ప్రముఖులకు చెందిన కామినేని గ్రూప్ ఆఫ్ కంపెనీలు, మెడికల్ కాలేజీలకు చెందిన కార్యాలయాలు, నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సూరారంలోని మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, యెనుగొండలోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్(MNR) మెడికల్ కాలేజీ, శామీర్‌పేటలోని మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చల్మెడ ఆనందరావు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో కేంద్ర బలగాలతో ఈడీ అధికారులు 16 బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించారు. దీంతోపాటు కామినేని గ్రూప్ చైర్మన్ కె.సూర్యనారాయణరావు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ ఇళ్లలోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్‌లోని ప్రతిమ కార్పొరేట్ కార్యాలయంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. హైదరాబాద్(Hyderabad)లో ఇటీవల భారతీయ రాష్ట్ర సమితి (BRS) కార్యకర్తలపై వరుస దాడులు జరగిన తర్వాత ఈరోజు పలు మెడికల కాలేజీలపై ఈడీ దాడులు జరగడం కలకలం రేపుతున్నాయి.