»Rrr Lease Issue Hmda Reluctant To Withdraw Legal Notice To Revanth Reddy
HMDA: రేవంత్ రెడ్డికి ఘాటు రిప్లై ఇచ్చిన హెచ్ఎండిఏ
మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanth Reddy)పై మే 25న జారీ చేసిన లీగల్ నోటీసును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (HMDA) మంగళవారం పేర్కొంది.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి జారీ చేసిన లీగల్ నోటీసును ఉపసంహరించుకునే ప్రశ్న లేదని హెచ్ఎండిఏ(HMDA) స్పష్టం చేసింది. అధికారులు లేదా సంస్థ పనితీరుపై అపోహలు, రాజకీయ ఉద్దేశ్యాలను ప్రస్తావిస్తూ ప్రత్యేకంగా అధికారుల పేర్లను రేవంత్ రెడ్డి పేర్కొనడంపై హెచ్ఎండిఏ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వానికి లోబడి, ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ పనిచేస్తుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి మరువరాదని, పునరుద్ఘాటించింది. అధికారులు, సంబంధిత విభాగాలు నిబంధనల ప్రకారం తమ విధులను నిర్వహిస్తున్నారని హెచ్ఎండిఏ తెలిపింది. మంత్రి మండలి, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం హెచ్ఎండిఏ పని చేస్తుందని వివరించింది.
NHAI నుంచి TOT బిడ్ కోసం నిర్దేశించిన నిబంధనలను అనుసరించి, ORR TOT బిడ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించినట్లు హెచ్ఎండిఏ తెలిపింది. 30 సంవత్సరాలకు TOT బిడ్ అనేది మంత్రి మండలి నిర్ణయానికి అనుగుణంగా ఉందని, NHAI నుంచి రెండు బిడ్లు 30 సంవత్సరాల కాలానికి ఖరారు అయ్యాయని, TOT చేయడం ఇదే మొదటిసారి కాదని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. బిడ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులందరూ తమ పనిని పారదర్శకంగా, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి నిర్వహించారని హెచ్ఎండిఏ వెల్లడించింది.
మరోవైపు రేవంత్ రెడ్డి RTI ప్రశ్నకు ప్రత్యుత్తరం అతనికి నిర్ణీత గడువులోగా సమర్పించబడిందని ORR TOT బిడ్ ప్రక్రియకు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని నిలిపివేయడం అనే ప్రశ్నే లేదని హెచ్ఎండిఏ స్పష్టం చేసింది. హెచ్ఎండిఏ తన అధికారిక విధులను నిర్వర్తించడంలో బెదిరింపులకు గురికావడానికి లేదా భ్రమింపజేయడానికి వీలులేదని చెప్పింది. అవసరమైన చట్టపరమైన చర్యల ద్వారా తన అధికారులను రక్షించుకోవడానికి హెచ్ఎండిఏ అవసరమైన అన్ని చర్యలను చేపడుతుందని తెలిపింది.