»Prime Minister Narendra Modi Inaugurated Aero India 2023 Show
Aero India Show ఆత్మవిశాసానికి ప్రతీక: ప్రధాని మోదీ
ఈ ప్రదర్శనలో ప్రపంచంలోని ముఖ్య దేశాల వైమానిక సంస్థలు, వాయుసేన విమానాలు పాల్గొంటాయి. హెలికాప్టర్లు, విమానాలు, రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీలు కూడా ప్రదర్శనకు వచ్చాయి. కంపెనీల మధ్య రూ.75 వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరుగుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు.
భారత వైమానిక శక్తి (India Air Force)ని చూడాలంటే బెంగళూరు వెళ్లాల్సిందే. ఆసియా (Asia)లోనే అతి పెద్ద విమాన ప్రదర్శన (Aero Show) బెంగళూరు (Bengaluru)లో సోమవారం ప్రారంభమైంది. మన రక్షణ శాఖ రెండేళ్లకు ఒకసారి నిర్విహించే ఈ ఎయిర్ షోలో దేశ, విదేశాలకు చెందిన యుద్ధ, పౌర విమానాలతో పాటు హెలికాప్టర్లు కొలువుదీరాయి. ఈ ప్రదర్శనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రారంభించారు.
కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు శివారులోని యలహంక వైమానిక శిక్షణ కేంద్రంలో 14వ ‘ఏరో ఇండియా -2023’ ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ అనే పేరిట ఈ షోను నిర్వహిస్తున్నారు. షో ప్రారంభమైన అనంతరం ప్రధాని మోదీ విమానాల విన్యాసాలను వీక్షించారు. ఈ ప్రదర్శనలో ప్రపంచంలోని ముఖ్య దేశాల వైమానిక సంస్థలు, వాయుసేన విమానాలు పాల్గొంటాయి. హెలికాప్టర్లు, విమానాలు, రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీలు కూడా ప్రదర్శనకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రదర్శనలో సమావేశాలు, విమానాల కొనుగోలు ఒప్పందాలు కూడా జరుగనున్నాయి.
ఈ షో ఆత్మవిశ్వాసానికి ప్రతీక
ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశం ఇచ్చారు. ‘ఏరో ఇండియా మన బలాన్ని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది ప్రదర్శన మాత్రమే కాదు మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్ వేగా నిలుస్తుంది. నవ భారత సామర్థ్యాలను చాటి చెప్పేందుకు ఈ షో వేదికైంది. ఈ ప్రదర్శనలో దాదాపు 100 దేశాలు పాల్గొంటున్నాయంటే భారత్ పై ప్రపంచం ఎంత విశ్వాసంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు విదేశీ రక్షణ రంగ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ మాత్రమే కాదు. ఎన్నో దేశాలకు బలమైన రక్షణ భాగస్వామిగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా భారత్ ముందడుగు వేస్తోంది’ అని ప్రధాని మోదీ తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కర్ణాటక ప్రజాప్రతినిధులతో వైమానిక, రక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.75 వేల కోట్ల ఒప్పందాలు
ఈ ప్రదర్శనలో ఎయిర్ బస్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్ సీ రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయిస్, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హెచ్ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్ వంటి దేశ, విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ షోలో భాగంగా ఆయా కంపెనీల మధ్య రూ.75 వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరుగుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరించారు.
సందర్శకులకు అనుమతి
2021లో జరిగిన ప్రదర్శనలో సందర్శకులకు అనుమతించలేదు. ఈసారి కరోనా భయం లేకపోవడంతో ప్రదర్శనకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు. ఇప్పటికే రిహార్సల్స్ కు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఇప్పుడు 16, 17 తేదీల్లో సాధారణ ప్రజలు కూడా ఏరో షోకు హాజరు కావొచ్చు. ఈ ప్రదర్శన కొనసాగుతున్న ఐదు రోజుల్లో రోజుకు రెండు సార్లు విమానాల విన్యాసాలు సందడి చేయనున్నాయి. ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు విన్యాసాలు జరుగుతాయి. సందర్శకుల కోసం ఫుడ్ కోర్టులు కూడా అందుబాటులో ఉంచారు. ఇక ప్రదర్శన ప్రాంతం యలహంకకు రావడానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
Aero India is a wonderful platform to showcase the unlimited potential our country has in defence and aerospace sectors. https://t.co/ABqdK29rek