»Police Arrest The Gang Who Are Selling Fake Ipl Tickets Hyderabad
Fake ipl tickets: హైదరాబాద్ లో నకిలీ ఐపీఎల్ టికెట్లు.. ముఠా అరెస్టు..!
ఐపీఎల్(Ipl) మ్యాచ్ లు అనగానే ఇప్పటి వరకు మనకు బెట్టింగులతో డబ్బులు సంపాదిస్తారని మాత్రమే తెలుసు. కానీ, ఐపీఎల్ ఫేక్ టికెట్లు(Fake ipl tickets) కూడా అమ్మి సొమ్ము చేసుకునేవారు ఉన్నారని ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ ముఠాని పోలీసులు అరెస్టు చేశారు.
ప్రస్తుతం ఐపీఎల్(ipl) ఫీవర్ నడుస్తోంది. కొందరు ఐపీఎల్ మ్యాచులను టీవీల్లో చూసి ఆనందిస్తుంటే, కొందరు మాత్రం స్టేడియం కి వెళ్లి మరీ చూడాలని ఆశపడుతూ ఉంటారు. కానీ స్టేడియంలో టికెట్లు దాదాపు అందరికీ దొరకవు. దీంతో.. బ్లాక్ లో కొనడానికైనా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. అలాంటివారి ఉత్సాహాన్ని ఆసరాగా తీసుకున్న ఓ ముఠా నకిలీ ఐపీఎల్ టికెట్లు అమ్మడం గమనార్హం. ఈ దందా హైదరాబాద్(hyderabad) నగరంలోనే మొదలుపెట్టడం గమనార్హం.
కాగా, నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను ఉప్పల్ పోలీసులు(police) అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపోని ఈవెంట్స్ అండ్ ఎంట్టైన్మెంట్ వెండర్ ఏజెన్సీలో సబ్ కాంట్రాక్టర్ కోమట్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి పని చేస్తున్నారు. గోవర్ధన్ రెడ్డి ఐపీఎల్ 2023 మ్యాచులకు అఖిల్ అహ్మద్, పెగ్గిది మృదుల్ వంశీ, మహమ్మద్ ఫాహీం, శ్రావణ్ కుమార్, మహమ్మద్ అజార్లను వ్యాలిడేటర్లుగా నియమించుకున్నాడు.
వ్యాలిడేటర్లకు జారీ చేసిన అక్రెడిటేషన్ కార్డులలోని బార్ కోడ్ని కాపీ చేసి నకిలీ టిక్కెట్ల(Fake ipl tickets)ను తయారు చేస్తున్నారు. ఆ టిక్కెట్లను కేటుగాళ్లు అమ్ముతున్నారు. ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచుకు ఏకంగా 200 అక్రమ నకిలీ టిక్కెట్స్ సృష్టించి క్రికెట్ అభిమానులకు కేటుగాళ్లు విక్రయించారు.
పక్కా సమాచారంతో నిఘా వేసిన ఉప్పల్ పోలీసులు(uppal police) నిందుతులను పట్టుకున్నారు. ఫేక్ టికెట్స్ అమ్ముతున్న ముఠాను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద ఉన్న 68 నకిలీ ఐపీఎల్ టిక్కెట్స్, మూడు ఐపీఎల్ అక్రెడిటేషన్ కార్డులు, మూడు సెల్ ఫోన్లు, ఒక సీపీయు, హార్డ్ డిస్క్, మానిటర్ స్వాధీనం చేసుకున్నారు. నిందులను పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. ఈ ఫేక్ దందా ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇంకా ఎవరి హస్తం ఉంది, ఇప్పటివరకు ఎన్ని టికెట్స్ అమ్మారు అనే సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు చాలా ఫేక్ టికెట్స్ అమ్మినట్టు తెలుస్తోంది.