»Pm Modi Said By 2030 6g Services In The India Will Be Implemented In Two Phases
PM Modi: 2030 నాటికి దేశంలో 6జీ సేవలు..రెండు దశల్లో అమలు
2030 నాటికి దేశంలో(india) 6జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) అన్నారు. ఈ సందర్భంగా 6G విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించిన క్రమంలో పేర్కొన్నారు. ఇది రెండు దశల్లో అమలు చేయబడుతుందని చెప్పారు.
భారతదేశంలో(india) 2030 నాటికి హై స్పీడ్ 6G కమ్యూనికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు ప్రధాని మోదీ(pm modi) తెలిపారు. దేశంలో నెక్ట్స్ సాంకేతికత పరిశోధన, విస్తరణకు నిధులు సమకూర్చడానికి భారత్ 6G ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ విజన్ డాక్యుమెంట్ ను బుధవారం ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఇండియాలో 6G ప్రాజెక్టు రెండు దశల్లో అమలు చేయబడుతుందని వెల్లడించారు. మొదటిది 2023 నుంచి 2025 వరకు, రెండవది 2025 నుంచి 2030 వరకు అమలు చేయనున్నారు. ప్రాజెక్ట్‌ను పర్యవేక్షణ, ప్రామాణీకరణ, 6G వినియోగం కోసం స్పెక్ట్రమ్‌ను గుర్తించడం, పరికరాలు, పర్యావరణ వ్యవస్థను గుర్తించడం వంటి అంశాలపై దృష్టి సారించడానికి ప్రభుత్వం ఒక అపెక్స్ కౌన్సిల్‌ను నియమించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో 5జీ టెక్నాలజీ(5g technology) అందుబాటులోకి వచ్చిన 6 నెలల్లోనే 6జీ గురించి మాట్లాడుతున్నామని ప్రధాని చెప్పారు. ఇది దేశ విశ్వాసాన్ని తెలియజేస్తోందన్నారు. “4Gకి ముందు భారతదేశం టెలికాం టెక్నాలజీని మాత్రమే ఉపయోగించేదన్నారు. కానీ ఇప్పుడు భారతదేశం టెలికాం టెక్నాలజీ అతి పెద్ద ఎగుమతిదారుగా మారడానికి వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.
అపెక్స్ కౌన్సిల్ భారతీయ స్టార్టప్‌లు, కంపెనీలు, పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాల ద్వారా 6G టెక్నాలజీపై(6g technology) పరిశోధన చేసి అభివృద్ధి, రూపకల్పనకు సూచనలు చేయనుంది. ఆ నేపథ్యంలో భారతదేశంలో మేధో సంపత్తి, ఉత్పత్తులు, సరసమైన 6G టెలికాం సొల్యూషన్స్ పరిష్కారాలు, పోటీ ప్రయోజనాల ఆధారంగా 6G ప్రాధాన్యత గల ప్రాంతాలను గుర్తించనున్నట్లు ప్రకటించారు. టెరాహెర్ట్జ్ కమ్యూనికేషన్, రేడియో ఇంటర్‌ఫేస్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సరికొత్త ఎన్కోడింగ్ పద్ధతులు, 6G పరికరాలు, చిప్సెట్లు వంటి కొత్త సాంకేతికతలపై కౌన్సిల్ దృష్టి ఉంటుందని వెల్లడించారు.
2022 అక్టోబర్‌లో మోదీ లాంఛనంగా 5జీ సేవలను ప్రారంభించి వచ్చే 10 ఏళ్లలో 6జీ సేవలను ప్రారంభించేందుకు భారత్(india) సిద్ధంగా ఉందని ఆ సమయంలో చెప్పారు. గరిష్టంగా 10 Gbps వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందించగల 5Gకి విరుద్ధంగా, 6G.. 1 Tbps వరకు వేగంతో అల్ట్రా స్పీడ్ అందిస్తుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ ప్రకారం 6G వినియోగంలో రిమోట్ నియంత్రిత కర్మాగారాలు, నిరంతరం కమ్యూనికేట్ చేసే స్వీయ నియంత్రిత కార్లు, స్మార్ట్ వేరబుల్స్ ఉంటాయని అన్నారు. 6G సపోర్టింగ్ కమ్యూనికేషన్ పరికరాలు బ్యాటరీతో నడిచేవి ఉండనున్నట్లు తెలుస్తోంది.