కొంతకాలంగా గుండెపోటు (Heart Attack) మరణాలు ఆగడం లేదు. వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గరి నుంచి పెద్దవారి వరకూ గుండెపోటుకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు బాగా పెరిగాయి. తొమ్మిది, పదో తరగతి విద్యార్థుల నుంచి 50 ఏళ్ల వయసున్న వారి వరకూ గుండెపోటుతో మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. తాజాగా ఖమ్మం (Khammam) జిల్లాలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు.
ఖమ్మం(Khammam) జిల్లాలోని ఎన్ఎస్పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాజేష్ (Rajesh) ఎప్పటిలాగే స్కూలుకు వచ్చాడు. అయితే స్కూలుకు వెళ్లిన కాసేపటికే గుండె నొప్పిగా ఉందని టీచర్‌కు చెప్పాడు. గుండెపై చేయిపెట్టుకుని చాలా సేపు బాధపడ్డాడు. నొప్పిని తట్టుకోలేక విలవిల్లాడాడు. స్థానికులు రాజేష్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజేష్ మరణించాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. చిన్న వయసులో గుండెపోటు (Heart Attack) రావడం ఏంటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.