»Huge Quantity Of Drugs Seized In Hyderabad Film Nagar
Drugs Mafia: హైదరాబాద్ ఫిలిమ్ నగర్లో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాను పోలీసులు గుర్తించారు. దందా నిర్వహిస్తున్న నైజీరియన్‌ను అరెస్ట్ చేశారు. అతని నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్ ను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ దందా (Drugs Mafia) జరుగుతూనే ఉంది. తాజాగా నేడు హైదరాబాద్ (Hyderabad)లోని ఫిలిం నగర్ (Film Nagar)లో భారీ మొత్తంలో డ్రగ్స్ లభించింది. బెంగళూరు కేంద్రంగా డేవిడ్సన్ అనే నైజీరియన్ ఆ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ నైజీరియన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆలిండియా నైజీరియన్ వెల్ఫేర్ ఛైర్మన్‌గా డేవిడ్సన్ ఉంటూ ఈ దందా నడుపుతున్నాడు.
వెల్ఫేర్ ముసుగులోనే డ్రగ్స్ దందా నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నకిలీ పాస్‌పోర్ట్, వీసాతో ఆ వ్యక్తి ఇండియాలో నివశిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా తప్పుడు సిమ్ కార్డులను వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డేవిడ్సన్ (Davidson) రూమ్ వద్ద భారీ మొత్తంలో డ్రగ్స్ ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (Cv anand) మాట్లాడుతూ..డేవిడ్సన్తో పాటుగా మరో ఆరుగురిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అత్యాధునిక కార్లలో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న డేవిడ్సన్ను అరెస్ట్ చేసి అతని వద్ద రూ.11 లక్షలు విలువ చేసే ఎండీఎంఏను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఇతర దేశాల నుంచి ఇండియాకు పెద్ద మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చి దందా నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.