కోడి కత్తి కేసులో (Kodi Kathi case) మరింత దర్యాఫ్తు కోసం అభ్యర్థిస్తూ ఏపీ సీఎం జగన్ (ap cm ys jagan) దాఖలు చేసిన పిటిషన్ల పైన ఎన్ఐఏ కోర్టులో (nia court) గురువారం కౌంటర్లు దాఖలయ్యాయి. ఎన్ఐఏ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశాల్ గౌతమ్, నిందితుడు శ్రీనివాస రావు తరఫున లాయర్ సలీం కౌంటర్లు దాఖలు చేశారు. వీటి పైన వాదనలు వినిపించేందుకు సమయం కావాలని జగన్ తరఫు లాయర్ వెంకటేశ్వర్లు కోరారు. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. కేసు విచారణ పూర్తి కాకుండా, సాగదీసే ధోరణితో జగన్ పిటిషన్లు (ys jagan petition) దాఖలు చేసినట్లుగా కనిపిస్తోందని నిందితుడి తరఫు లాయర్ తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ మీద ఆసక్తి లేదని, కోర్టుకు రాకుండా ఉండేందుకు.. మరింత దర్యాఫ్తు అంటూ పిటిషన్ దాఖలు చేశారన్నారు. కోర్టుకు ఇరవై కిలో మీటర్ల దూరంలో ఉన్నా… న్యాయస్థానానికి రావడానికి సుముఖంగా లేరన్నారు. ఎన్ఐఏ దర్యాఫ్తు చేసి, ఛార్జీషీట్ దాఖలు చేసిందన్నారు (nia chargesheet). సాక్షుల విచారణ ప్రారంభం అయిందన్నారు. విచారణ సమయంలో కొత్త వాస్తవాలు బయటకు రాలేదని, ఇలాంటి సమయంలో పూర్తయిన దర్యాఫ్తును పక్కన పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కొత్త విషయాలు వెలుగు చూడనప్పుడు మరింత దర్యాఫ్తు కావాలని కోరడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.
సాక్షిగా కోర్టుకు హాజరవ్వాలని ఆయనకు ఇప్పటికే సమన్లు జారీ అయ్యాయని, రాష్ట్ర సీఎంగా ఆయన చట్టాన్ని గౌరవించాలన్నారు. కానీ భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. మరింత దర్యాఫ్తు అని పిటిషన్ దాఖలు చేసినప్పటికీ… ఇప్పటికే జరిగిన విచారణలో వెలుగుచూడని కొత్త వాస్తవాలను అయితే పేర్కొనలేదు. సీఎంగా ఉన్నందున కోర్టుకు రావడానికి ఆయన నామోషీగా భావిస్తున్నారేమోనని, అందుకే విచారణను సాగదీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పైగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని పిటిషన్ లో అభ్యర్థించడం ద్వారా కోర్టులో విచారణ సాగడం ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందన్నారు. కోర్టు హాజరు నుండి తప్పించుకోవడానికే ఈ పిటిషన్ వేశారన్నారు. కోర్టుకు 20 కిలో మీటర్ల దూరంలోనే ఉంటారని, చట్టాన్ని గౌరవించాల్సిందేనని చెప్పారు. ఎంత పెద్ద వ్యక్తి అయినా చట్టం ముందు నిలబడాల్సిందే అన్నారు. కాబట్టి మరింత దర్యాఫ్తు అంటూ జగన్ వేసిన పిటిషన్ ను కొట్టి వేయాలని విజ్ఞప్తి చేశారు.