టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Ketireddy Venkatarami Reddy)పై హాట్ కామెంట్స్ చేశారు. కేతిరెడ్డి ఎర్రగుట్ట భూములను ఆక్రమించారని ఆరోపించారు. 902, 909 సర్వే నంబర్లలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి ఫామ్‌హౌస్ కట్టించుకుని ప్రజలకు నీతులు చెబుతున్నారని కేతిరెడ్డిపై లోకేష్ మండిపడ్డారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Ketireddy Venkatarami Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేతిరెడ్డి చెప్పేవి నీతులు.. దోచేవి గుట్టలని ఆరోపించారు. ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని లోకేష్ అన్నారు. 902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను అక్రమించాడని ఆరోపించారు. ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే గారి విలాస కార్యక్రమాలకు అడ్డా అని తనదైన స్టైల్లో విమర్శించారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు. కానీ అతను మాత్రం వాటిని పాటించకుండా గుట్టలను దోచేస్తాడని విమర్శించారు.
ఈ క్రమంలో లోకేశ్(Lokesh) శనివారం సాయంత్రం పలు చేనేత కార్మికుల కాలనీలను సందర్శించారు. అక్కడ చేనేత కార్మికులు బాధలను ఆయనతో పంచుకున్నారు. పట్టణంలోని జనాభాలో 75 శాతం మంది చేనేత కార్మికులుగా ఉన్నారని, ఆ వృత్తినే తమ జీవనోపాధిని పొందుతున్నారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో వస్త్రాల ముడిసరుకు ధరలు అనేక రెట్లు పెరిగాయని వాపోయారు. ఈ క్రమంలో అనేక మంది అప్పుల బాధ తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. గడిచిన నాలుగేళ్లలో 56 మంది నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని అడిగినా కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చేనేత కార్మికులు లోకేష్ కు మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో చేనేత కార్మికులకు పూచీకత్తు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
వారి బాధలను విన్న లోకేష్ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(jagan mohan reddy) పాలనను ప్రజల పాలిట శాపంగా అభివర్ణించారు. ఆత్మహత్యలు చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంలో విఫలమయ్యారని, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా ముఖ్యమంత్రి రాలేదని ఆయన మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని, అందులో ముడిసరుకు కొనుగోలుపై 90 శాతం సబ్సిడీతో పాటు రూ.1.10 కోట్ల రుణాలను కూడా మాఫీ చేసిందని లోకేష్ గుర్తు చేశారు. చంద్రన్న బీమా పథకం చేనేత కార్మికులకు వరం లాంటిదని అన్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.