Balagam: బలగం డైరెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ఆ నేతల ఫిర్యాదు
బలగం సినిమా పైన కొందరు ఎంపీటీసీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తీసిన దర్శకుడు వేణు యెల్దండి పైన ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జబర్దస్త్ కమేడియన్ (jabardasth venu) వేణు యెల్దండి దర్శకత్వంలో (venu yeldandi) వచ్చిన బలగం సినిమా (balagam movie) అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. సినిమాకు కేవలం రూ.2 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పటి వరకు అంతకు పది నుండి పదిహేను రెట్ల ఆదాయం వచ్చింది. ఈ సినిమా జనాల్లోకి ఎంతలా వెళ్లిందంటే చాలా గ్రామాల్లో ఈ సినిమాను పంచాయతీ కార్యాలయం, పాఠశాలల్లో ప్రదర్శిస్తున్నారు. గ్రామస్తులు అందరూ ఒక చోటకు వచ్చి ఈ సినిమాను వీక్షిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే సర్పంచ్ లే సినిమాను వేయడం గమనార్హం. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. ఈ సినిమా విదేశాల్లోను పలు అవార్డులను కూడా అందుకున్నది. అలాంటి సినిమా పట్ల ఎవరు ఎలాంటి వ్యతిరేకత ప్రదర్శించినా చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత మంచి సినిమా పట్ల కావాలని రాద్దాంతం చేస్తున్నారని అంటున్నారు.
ఇలాంటి బలగం సినిమా పైన కొందరు ఎంపీటీసీలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తాజాగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా తీసిన దర్శకుడు వేణు యెల్దండి పైన ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఎంపీటీసీలు అంటున్నారు. ప్రజాప్రతినిధులైన తమను కించపరిచేలా తీసిన కొన్ని సన్నివేశాలు తమను బాధించాయని తహసీల్దారు మహేశ్వరను కలిసి వినతి పత్రం అందించారు. బలగం సినిమాలో ఎంపీటీసీలను కించపరిచేలా ఉన్న సీన్లను తొలగించి దర్శకుడి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.