»Minister Vidadala Rajini Said Classes In Five Medical Colleges In September 2023 More 12 Medical Colleges Soon In Ap
Vidadala Rajini: సెప్టెంబర్లో 5 మెడికల్ కాలేజీల్లో క్లాసులు..త్వరలో మరో 12 కాలేజీలు
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మంత్రి, విడదల రజినీ(Vidadala Rajini) ఆగస్టులో ఐదు కొత్త మెడికల్ కాలేజీలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే వీటిలో తరగతులు సెప్టెంబర్లో ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆగస్టులో ఐదు కొత్త మెడికల్ కాలేజీ(medical colleges)లను ప్రారంభిస్తామని ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) స్పష్టం చేశారు. సెప్టెంబర్లో తరగతులు ప్రారంభిస్తామని మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ప్రిన్సిపాళ్లతో కొత్త కళాశాలల పనుల పురోగతిని ఆమె సమీక్షించారు. విజయనగరం, ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, రాజమహేంద్రవరంలలో ఇన్స్టిట్యూట్లు రానున్నాయి. ఒక్కో కాలేజీలో 150 సీట్లు ఉంటాయని, రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారని ఆమె ఉద్ఘాటించారు.
ఐదు కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (NMC) నుంచి అనుమతులు లభించాయని, నిర్మాణ పనులు, హాస్టళ్ల స్థాపన, పారిశుధ్యం, విద్యుత్ సరఫరా, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టాలని మంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యార్థుల సౌకర్యార్థం సరిపడా బస్సులు కొనుగోలు చేయాలని ఆమె ఆదేశించారు. కొత్త మెడికల్ కాలేజీల వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని రజిని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొత్త కాలేజీల నిర్మాణం, మౌళిక వసతుల కోసం ప్రభుత్వం ర.8500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీంతోపాటు రానున్న మూడేళ్లలో మరో 12 వైద్య కాలేజీలు రానున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్, తదితరులు పాల్గొన్నారు.