తెలుగు సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాగా…అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు.
కె విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. కళాతపస్వీ ఇకలేరని తెలుసుకున్నతెలుగు చిత్రపరిశ్రమ షాక్కు గురైంది. కాశీనాధుని విశ్వనాథ్ తెలుగులో ఎన్నో గొప్ప మరుపురాని అజరామరమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. లలిత కళలపట్ల మక్కువతో ఆ నేపథ్యంతోనే ఎక్కవగా చిత్రాలను రూపొందించారు. ఏ హీరోతో ఏ సినిమా చేసినా ఆ సినిమా అంతా కళలతో కళకళలాడేది. అందుకే తెలుగు చిత్రపరిశ్రమ ఆయన్ను కళాతపస్వీ అని ముద్దుగా పిలుచుకున్నది.
కాశీనాథుని విశ్వనాథ్ 1930 పిబ్రవరి 19వ తేదీన గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జన్మించారు. చిన్నతనం నుండి రామాయణ, మహాభారత గ్రంధాలను వింటూ, చదువుతూ అందులో ఉన్న అంశాలను అవగతం చేసుకున్నారు. డిగ్రీ పూర్తిచేసిన అనంతరం, కె విశ్వనాథ్ చెన్నైలోని వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డర్గా జీవితాన్ని ప్రారంభించారు.
ఈ తరువాత పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డర్గా పనిచేశారు. అనంతరం దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వద్ద కొంతకాలం దర్శకత్వ శాఖలో పనిచేశారు. దుక్కిపాటి మధుసూథనరావు కె విశ్వనాథంకు ఆత్మగౌరవంతో దర్శకత్వం అవకాశం లభించింది. ఆ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ తరువాత ఎన్నో శంకరాభరణం, స్వర్ణకమలం, స్వయంకృషి, సిరివెన్నెల, స్వాతిముత్యం, స్వాతికిరణం, సాగరసంగమం వంటి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.