»Kvp Ramachandra Rao Condemns Ysrcp Silence On Rahul Gandhis Disqualification
Democracy ప్రమాదంలో పడితే YSRCP నోరు విప్పదా? కేవీపీ తీవ్ర ఆగ్రహం
దేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే.. గౌతమ్ అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి. మనం కట్టే ప్రతి కరెంట్ బిల్లులో అదానీకి వాటా వెళ్తోంది. అదానీ నుంచి ప్రధాని మోదీకి వాటా వెళ్తోంది
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)పై వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడైన కేవీపీ రామచంద్ర రావు (KVP Ramachandra Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ (YS Jagan) తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీగా రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు పడగా ప్రజాస్వామ్యవాదులుగా స్పందించరా? అని నిలదీశారు. ఏపీ నుంచి 25 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరైనా నోరు మెదిపారా? అని ప్రశ్నించారు. రాహుల్ పై వేటు విషయమై నిర్వహించిన మీట్ ద ప్రెస్ (Meet The Press)లో కేవీపీ మాట్లాడారు.
విజయవాడలో (Vijayawada) శనివారం మీడియాతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ (Indian National Congress Party-INC) పార్టీ సీనియర్ నాయకుడు కేవీపీ మాట్లాడుతూ.. ‘భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని ప్రమాదకర పద్ధతులను కేంద్ర ప్రభుత్వం పాటిస్తోందని మండిపడ్డారు. ఉన్మాద మనస్తత్వం కలిగిన ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాం అని పేర్కొన్నారు. అదానీ వ్యవహారంపై స్పందిస్తూ ‘భారతదేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. దేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే.. గౌతమ్ అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయి. మనం కట్టే ప్రతి కరెంట్ బిల్లులో అదానీకి వాటా వెళ్తోంది. అదానీ నుంచి ప్రధాని మోదీకి వాటా వెళ్తోంది’ అని కేవీపీ ఆరోపించారు.
‘అదానీని ప్రశ్నిస్తే దేశ ద్రోహం కిందకు పరిగణించడం దారుణం. ఒక అవినీతిపరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కిందకు వస్తుందా? ఈ దేశానికి సేవ చేసిన చరిత్ర నెహ్రూ కుటుంబానిది. 20 ఏళ్ల పార్లమెంటీరియన్ ప్రసంగాన్ని పూర్తిగా తొలగించడం సరికాదు. ప్రపంచ చరిత్రలో ఇలాంటి పరిస్థితిని ఎక్కడా చూడలేదు. బీసీలను రాహుల్ అవమానించారని జేపీ నడ్డా ఎలా అంటారు? పార్లమెంట్ సభ్యుడి అనర్హతపై రాష్ట్రపతి సంతకం చేయాలి. మరి రాష్ట్రపతి సంతకంతోనే రాహుల్ పై అనర్హత వేశారా? నెహ్రూ వంటి దేశభక్తి కుటుంబానికి ఢిల్లీ ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఈ దుర్మార్గాన్నిదేశ పౌరులంతా ప్రశ్నించాలి’ అని కేవీపీ పిలుపునిచ్చారు. ‘జగన్ కు బీజేపీకి మధ్య ఉన్న బంధం ఏమిటో నాకు తెలియదు. వైఎస్సార్ కు దగ్గరగా ఉన్న నేను జగన్ ఎందుకు దూరమయ్యానో త్వరలో ప్రెస్ మీట్ పెట్టి చెబుతా’ అని సంచలన ప్రకటన చేశాడు.