వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) తల్లిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ ప్రబోధకుడు కేఏ పాల్ (KA Paul) పరామర్శించారు. ఆమె చికిత్స పొందుతున్న కర్నూలులోని (Kurnool) ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అకస్మాత్తుగా పాల్ ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసుపై విమర్శలు గుప్పిస్తున్న పాల్ పరామర్శించడం కలకలం రేపింది.
ఈనెల 19వ తేదీన పులివెందులలోని బాకరాపురంలోని నివాసంలో అవినాశ్ రెడ్డి తల్లి లక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. స్థానికంగా ప్రాథమిక వైద్యం అనంతరం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో (Viswa Bharathi Hospital) చేర్పించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెను ఇటీవల సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, మేనత్త విమలారెడ్డి పరామర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పాల్ ఆస్పత్రికి వచ్చారు. కాగా.. ఎవరూ వచ్చిన వైసీపీ కార్యకర్తలు, అవినాశ్ అనుచరులు అడ్డుకుంటుండగా.. పాల్ రాగానే లోపలికి అనుమతి ఇచ్చారు. పాల్ నేరుగా ఆస్పత్రిలోకి వెళ్లి లక్ష్మిని పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసినట్లు తెలుస్తోంది.
కాగా అవినాశ్ తల్లి ఆరోగ్యం మెరుగైందని (Health Condition) ఆస్పత్రి హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేసింది. ‘లక్ష్మి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సీసీయూలో చికిత్స కొనసాగుతోంది. అల్ట్రా స్కాన్ (Ultra Scan)లో పురోగతి కనిపించింది. మూడు రోజుల నుంచి కోలుకుంటున్నారు. వాంతులు తగ్గుముఖం పట్టాయి. సాధారణ గదికి ఆమెను తరలించాలని అనుకుంటున్నాం’ అని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది.