కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (karantaka assembly elections) కేజీఎఫ్ బాబు (kgf) భార్య ఓ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతోంది. వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బెంగళూరు సెంట్రల్ చిక్కపేట అసెంబ్లీ నియోజకవర్గం (Chickpet Assembly constituency) నుండి షాజియా తరుణం అనే మహిళ నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తుల విలువ రూ.1622 కోట్లుగా ప్రకటించుకున్న ఓ కోటీశ్వరుడి భార్య. బెంగళూరులో గుజిరీ వ్యాపారాన్ని ప్రారంభించి కోట్లకు పడగలెత్తి ఈ కేజీఎఫ్ వాసి పేరు యూసఫ్ షరీఫ్. కేజీఎఫ్ బాబు అంటారు. ఇప్పుడు ఆయన భార్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం కర్నాటకలో చర్చనీయాంశంగా మారింది. షాజియా తన భర్త, కుమార్తెతో కలిసి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వయస్సు 37. నిన్నటి వరకు ఈమె హోమ్ మేకర్. 7వ తరగతి వరకు చదువుకున్నది. తన భర్త సూచన మేరకు తాను నామినేషన్ పత్రాలు దాఖలు చేశానని, తన భర్తతో పాటు వందలాది మంది అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు.
ఆయన ఇటీవలి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. రెండేళ్ల క్రితం బెంగళూరు నుండి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు కేజీఎఫ్ బాబు. ఆ సమయంలో ఆయన వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఆయన ప్రకటించిన దాని కంటే ఎక్కువే ఉందని బీజేపీ ఆరోపించింది. 2018లో తన, తన భార్య ఆస్తులను రూ.1743 కోట్లుగా పేర్కొన్న కేజీఎఫ్ బాబు.. ఈసారి రూ.1622 కోట్లుగా చెప్పారు. గతంలో కంటే రూ.121 కోట్లు తగ్గింది. ఈసారి చిక్కపేట నుండి పోటీ చేస్తానని అడగ్గా.. కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా భార్యను రంగంలోకి దింపారు. తాము గెలిస్తే 23000 కుటుంబాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్, 3000 ఇళ్ల నిర్మాణం, 60,000 మందికి స్కాలర్ షిప్స్ ఇస్తామని చెప్పారు.