జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన బీఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao)కు ఆది నుంచి తోడుగా.. అండగా నిలుస్తున్న పార్టీ కర్ణాటకలోని (Karnataka) జనతా దళ్ (సెక్యులర్) (JD-S) పార్టీ. మాజీ ప్రధానమంత్రి, జేడీ (ఎస్) అధినేత హెచ్ డీ దేవేగౌడ (HD Deve Gowda), మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) బీఆర్ఎస్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కాగా ఇప్పుడు వారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగనున్నాయి. తమ మిత్రబంధం కొనసాగింపుగా కేసీఆర్ కర్ణాటకలో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తారని దేవేగౌడ ప్రకటించారు. కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ పర్యటిస్తారా? లేదా అనే సందేహాలకు దేవేగౌడ స్పష్టతనిచ్చారు.
బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయం జేపీ భవన్ (JP Bhavan)లో గురువారం విలేకరుల సమావేశంలో దేవేగౌడ మాట్లాడారు. ఎన్నికల్లో మా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి సీఎం కేసీఆర్ (KCR) వస్తారు అని ప్రకటించారు. ఈ విషయమై కుమారస్వామితో బీఆర్ఎస్ నాయకులు చర్చలు చేస్తున్నారని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamata Banerjee) కూడా ప్రచారానికి వస్తారని తెలిపారు. భవిష్యత్ లో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ఈ దిశలోనే కేసీఆర్, మమతతో నిరంతరం చర్చలు చేస్తున్నట్లు చెప్పారు. వయోభారంతో వీలైనంత తక్కువగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. 42 చోట్ల ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
‘కర్ణాటకలో జనతాదళ్ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. పార్టీ ప్రకటించిన పంచరత్న పథకాలతో ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోలారు, హాసన, మండ్య జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో జేడీ(ఎస్) అభ్యర్థులు గెలిచారు’ అని దేవేగౌడ గుర్తు చేసుకున్నారు.