»K Kavitha Reply How To Join In Brs Party Tweet Goes To Viral
BRS Partyలో ఎలా చేరాలి? ఎమ్మెల్సీ కవిత ట్వీట్ వైరల్
నిత్యం కేసీఆర్ వార్త మహారాష్ట్రలో వినిపిస్తుండడంతో అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా ప్రాంతంలోని నాందేడ్ లో సభ నిర్వహించడంతో మరాఠా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ హాజరవడం కూడా మరాఠా ప్రజలు మరచిపోలేదు.
దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని భారత్ రాష్ట్ర సమితి (BRS Party) ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్ (Nanded)లో నిర్వహించిన సభ విజయవంతం కావడంతో మిగతా రాష్ట్రాల్లో విస్తరించేందుకు సిద్ధమవుతున్నది. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సానుకూల స్పందన లభిస్తోంది. కర్ణాటక (Karnataka), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), మహారాష్ట్ర, ఒడిశా, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఇప్పటికే ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (KCR) కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నాందేడ్ సభ విజయవంతంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)కు ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన కవిత రిప్లయ్ ఇచ్చారు. ఈ ట్వీట్ ప్రస్తుతం ట్విటర్ (Twitter)లో వైరల్ (Viral)గా మారింది.
మహారాష్ట్రకు చెందిన సాగర్ వరద్ (Sagar Varad) ఫిబ్రవరి 19వ తేదీన ఎమ్మెల్సీ కవితను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. ‘నేను మహారాష్ట్ర నుంచి. బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలి? వివరాలు ఏమైనా అందిస్తారా?’ అని సాగర్ కోరాడు. దీనికి కవిత సోమవారం స్పందించారు. ‘బీఆర్ఎస్ లోకి సంతోషంగా స్వాగతం పలుకుతున్నా. నీ వివరాలు మెసేజ్ చేయి. సాగర్ దేశవ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ పార్టీలో సభలు, సమావేశాల్లో పాల్గొని మన నాయకుడు, సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వవచ్చు’ అని కవిత ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా వీరిద్దరి ట్వీట్లను మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు రీట్వీట్లు, లైక్ లతో హోరెత్తిస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనను దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి సాగర్ ట్వీటే నిదర్శనమని పేర్కొన్నారు. సాగర్ లాంటి వాళ్లు చాలా మంది ఉందని చెబుతున్నారు. తెలంగాణ మోడల్ కు దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తోందని నాయకులు పేర్కొన్నారు. త్వరలోనే మహారాష్ట్ర రాజధాని ముంబైలో కూడా సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తారని తెలిపారు.
కాగా మహారాష్ట్రపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. పలుమార్లు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ బృందం పర్యటించింది. ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ తదితరులతో సమావేశమై సంచలనం సృష్టించారు. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పలుమార్లు నాటి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కలిసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఫడ్నవీస్ హాజరవడం కూడా మరాఠా ప్రజలు మరచిపోలేదు. నిత్యం కేసీఆర్ వార్త మహారాష్ట్రలో వినిపిస్తుండడంతో అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా ప్రాంతంలోని నాందేడ్ లో సభ నిర్వహించడంతో మరాఠా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీపై ఆసక్తి నెలకొంది.
Sagar Ji, you can support our leader and Hon’ble CM KCR Garu and @BRSparty by joining us in our public meetings and programs across the country.