పైన టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అయినట్లున్నారు. అసలు ఇది సాధ్యమా అనే ప్రశ్నకు కూడా మీకు తట్టి ఉండొచ్చు. కానీ.. నిజంగానే నాలుగేళ్ల లోపు చిన్నారులకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇస్తున్నారు. అంత చిన్న పిల్లలు చేసే పని ఏముంటుంది..? వారికి జీతం ఇవ్వడమేంటి..? ఇదెక్కడా అనే సందేహం కలుగుతుందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి,
దక్షిణ జపాన్‌లోని కిటక్యుషులో ఓ నర్సింగ్ హోమ్ లో నాలుగేళ్లు, అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు ఉద్యోగాలు ఇస్తోంది. వారు చేయాల్సిన పని అంతా.. పెద్దవాళ్లతో కూర్చుని నవ్వడం, కలిసి వాకింగ్‌కు వెళ్లడం! చేసిన పనికి జీతంగా.. డైపర్లు, పౌడర్ మిల్క్‌లు ఆ చిన్నారులకు ఇస్తారు.
ఆ నర్సింగ్ హోంలో 100కుపైగా మంది నివాసముంటున్నారు. వారిలో 80ఏళ్లు పైబడిన వారే ఎక్కువ. ఎలాంటి తోడు లేకపోవడంతో.. వారందరు నిరాశకు గురై, అనారోగ్యం పాలవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు.. నర్సింగ్ హోం సిబ్బంది ఈ వినూత్న ఐడియాతో ముందుకొచ్చింది. ఆలస్యం చేయకుండా.. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను నర్సింగ్ హోం బయట అతికించేసింది.
నర్సింగ్ హోంలో పిల్లల ఉద్యోగానికి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 30మంది చిన్నారులు రిజిస్టర్ చేసుకున్నారు. సంబంధిత కాంట్రాక్టులపై చిన్నారుల తల్లిదండ్రులు సంతకాలు చేశారు.
“వీ ఆర్ హైరింగ్(మేము ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాము)! పిల్లలు, వారి తల్లుల వద్దే ఉంటారు. నర్సింగ్ హోంలోకి వచ్చిన తర్వాత.. వృద్ధులను నవ్వించాల్సి ఉంటుంది. పిల్లలను చూస్తేనే చాలా మంది నవ్వేస్తున్నారు. పిల్లలకు షిఫ్ట్‌లు ఏమీ లేవు. ఎప్పుడంటే అప్పుడు బ్రేక్‌లు కూడా తీసుకోవచ్చు. నిద్రపోవడానికి, ఆకలి వేసినప్పుడు, మూడ్‌ని బట్టి బ్రేక్ తీసుకోవచ్చు,” అని నర్సింగ్ హోం హెడ్ గోండా తెలిపారు.