భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శుక్రవారం ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(SHAR) నుంచి ప్రయోగించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (sslv-d2) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 9.18 గంటలకు 350 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువున్న మూడు పేలోడ్లతో రాకెట్ నింగిలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ ప్రయోగంలో భాగంగా 15 నిమిషాల 28 సెకండ్ల వ్యవధిలో మూడు ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకున్నాయి. ఈ ప్రయోగం ద్వారా ఇండియాకు చెందిన భూ పరిశీలన నిమిత్తం EOS-07 ఉపగ్రహం కక్ష్యలోకి చేరింది. EOS -07 ఉపగ్రహంతోపాటు విద్యార్థినులు తయారు చేసిన ఆజాది శాట్ -2, అమెరికాకు చెంది జానుస్ -1 అనే ప్రైవేటు ఉపగ్రహాన్ని కూడా పంపించారు. ఇది ప్రధానంగా చిన్న ఉపగ్రహ ప్రయోగాలను ప్రయోగించేందుకు అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
దీంతో మా వద్ద ఒక కొత్త ప్రయోగ వాహనం SSLV అందుబాటుకి వచ్చిందని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్(s somanath) లాంచ్ అనంతరం చెప్పారు. ఇది రెండవ ప్రయత్నంలో ఉపగ్రహాలను చాలా కచ్చితంగా కక్ష్యలో ఉంచిందన్నారు. ఈ సందర్భంగా మూడు ఉపగ్రహ బృందాలకు అభినందనలు తెలియజేశారు. వేగంలో లోపం కారణంగా తాము మొదటి ప్రయోగం తృటిలో మిస్ అయ్యామని చెప్పారు. ప్రస్తుతం మేము ఆ సమస్యను విశ్లేషించి, దిద్దుబాటు చర్యలను గుర్తించి, సిస్టమ్‌ను అత్యంత వేగంతో ప్రయోగించి అర్హత సాధించామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ విజయంతో చిన్న ఉపగ్రహ ప్రయోగాలకు(small satellites) డిమాండ్ పెరగనుందన్నారు. దీంతోపాటు ఇస్రోకు భవిష్యత్ లో విదేశీ కస్టమర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న ఉపగ్రహాలను నింగిలోకి పంపించేందుకు SSLVని ఎంచుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. SSLVని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు భూమిపై నుంచి 500 కిలోమీటర్ల వరకు చిన్న ఉపగ్రహాలను ప్రయోగించవచ్చని స్పష్టం చేశారు. ఇది ప్రధానంగా తక్కువ ధరతోపాటు వేగవంతమైన స్పీడ్, బహుళ ఉపగ్రహాలకు అనుగుణంగా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. లాంచ్-ఆన్-డిమాండ్ ఫీజిబిలిటీ, కనీస ప్రయోగ అవస్థాపన అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. అనేక రోజులుగా చిన్న ఉపగ్రాహాలను పంపించాలని ఎదురు చూస్తున్న వారికి ఇది చక్కని అవకాశమని తెలిపారు.