భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో తీవ్ర విషాదం నిండింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ (74) కన్నుమూశాడు. కొన్నాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఇంటికి తీసుకొచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తిలక్ యాదవ్ పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు. అతడి మృతితో ఉమేశ్ యాదవ్ తీవ్ర విషాదంలో మునిగాడు.
ఉమేశ్ యాదవ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డియోరియా జిల్లా. తిలక్ యాదవ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉమేశ్. బొగ్గు గనిలో ఉద్యోగం రావడంతో ఉత్తరప్రదేశ్ వదిలేసి మహారాష్ట్రలోని నాగ్ పుర్ సమీపంలో ఉన్న ఖపర్ఖేడాకు వలస వచ్చారు. మిలన్ చౌక్ లో నివసిస్తున్నారు. మొదట్లో వీరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండేది. కుమారుడు ఉమేశ్ యాదవ్ క్రికెట్ లో రాణించాడు. కుటుంబ పరిస్థితి మెరుగైంది. కాగా ఉమేశ్ తండ్రి మృతితో భారత క్రికెట్ ఆటగాళ్లు సంతాపం తెలుపుతున్నారు. వారితోపాటు పలువురు ప్రముఖులు, అభిమానులు తిలక్ యాదవ్ మృతికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
వాస్తవానికి తిలక్ యాదవ్ కు రెజ్లింగ్ అంటే ఇష్టం. ఉమేశ్ ను భారత సైన్యంలో చేర్పించాలని కోరిక కూడా ఉండేది. కానీ కుమారుడు క్రికెటర్ కావడంతో ఊరుకున్నాడు. కానీ తండ్రి ఇష్టానికి భిన్నంగా ఉమేశ్ క్రికెట్ ఎంచుకున్నాడు. అయినా కూడా ఉమేశ్ కు తిలక్ సహకరించి ప్రోత్సహించాడు. ఇక ఉమేశ్ రంజీ క్రికెట్ లో సత్తా చాటాడు. అక్కడ అతడి ప్రతిభ చూసి బీసీసీఐ భారత జట్టులోకి చోటు కల్పించింది. 2010 ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఉమేశ్ ను సొంతం చేసుకుంది. నవంబర్ 2011లో వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో ఉమేశ్ అరంగేట్రం చేశాడు. విదర్భ తరఫున టెస్టు మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా ఉమేశ్ గుర్తింపు పొందాడు.