»Kt Rama Rao Bristol Myers Squibb To Invest Rs 800 Cr In Telangana
BMS తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. రూ.800 కోట్లు, 1,500 ఉద్యోగాలు
కంపెనీ ప్రతినిధులకు ఫార్మా సిటీలో ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలో స్థాపించే పరిశ్రమతో బీఎంఎస్ సంస్థ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించబోతున్నది.
భారతదేశంలో పెట్టుబడుల (Investments)ను అమితంగా ఆకర్షిస్తున్న రాష్ట్రం తెలంగాణ (Telangana). వారం రోజుల వ్యవధిలో మరో పెట్టుబడిని ఆకర్షించి తెలంగాణ సత్తా చాటింది. దేశంలో పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ నిలుస్తోంది. ప్రఖ్యాత సంస్థలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. హైదరాబాద్ (Hyderabad)తో పాటు రంగారెడ్డి, మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. ఇటీవల ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా (Gland Pharma) రూ.400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా బ్రిస్టల్ మైర్స్ స్క్విబ్ (Bristol Myers Squibb-BMS) హైదరాబాద్ లో రూ.800 కోట్ల (100 మిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. తమ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని వెల్లడించింది. రానున్న మూడేళ్లలో పరిశ్రమ ఏర్పాటు అవుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రపంచంలోనే ప్రసిద్ధమైన టాప్-10 ఫార్మాస్యూటికల్ కంపెనీలలో బీఎంఎస్ ఒకటి. ఈ మేరకు హైదరాబాద్ లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT Rama Rao) సమక్షంలో గురువారం బీఎంఎస్ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం బయో టెక్నాలజీ, ఐటీకి గొప్ప ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు.
‘బయో టెక్నాలజీ (Bio Technology), ఐటీ రంగాల్లో (IT Industry) బీఎంఎస్ సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. హైదరాబాద్ లోని మానవ వనరుల (Human Resources) నైపుణ్యం బీఎంఎస్ కు ఉపయుక్తంగా ఉంటుందని ఆశిస్తున్నా. 2028 నాటికి తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్ విలువ రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగా బీఎంఎస్ తో నేడు ఒప్పందం కుదుర్చుకున్నాం. లైఫ్ సైన్సెస్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు బీఎంఎస్ ఏర్పాటు ఒక గొప్ప అవకాశం. సంస్థ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తుందని భావిస్తున్నా. తెలంగాణలో అద్భుతమైన ప్రతిభాపాటవాలు ఉన్న యువత చాలా ఉంది. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీలో అద్భుతమైన ప్రతిభ ఉంది. రాష్ట్రంలో తయారీ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయాలని బీఎంఎస్ కు విన్నవిస్తున్నా’ అని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులకు ఫార్మా సిటీలో ఉన్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలో స్థాపించే పరిశ్రమతో బీఎంఎస్ సంస్థ ఐటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, వైద్య అనుబంధ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించబోతున్నది. హైదరాబాద్ తమ సంస్థ ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని బీఎంఎస్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
Global Pharmaceutical giant Bristol Myers Squibb to set up a state-of-the-art facility in Hyderabad with an investment of USD 100 Million. The proposed facility in Telangana will employ about 1,500 local youth. pic.twitter.com/Gc5PhF5yT6