»C Rajagopalachari Grandson Cr Kesavan Resigns To Congress Party
Congressకు భారీ షాక్.. పార్టీలో విలువల్లేవంటూ ప్రముఖ నేత రాజీనామా
పార్టీలో నా ప్రయాణం సాహసోపేతంగా సాగింది. రెండు దశాబ్దాలుగా నిస్వార్థంగా పని చేశా. కానీ ప్రస్తుతం పార్టీలో విలువలు లేవు. నాకు గౌరవం కూడా లేదు. ఈ క్రమంలోనే రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. ఇప్పుడు కొత్త మార్గాన్ని అన్వేషించుకోవాలని భావిస్తున్నా.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) పరిస్థితి మరింత దిగజారుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ (Bharat Jodo Yatra) తర్వాత పార్టీలో పరిస్థితులు చక్కబడలేవు. పార్టీని గాడీన పడుతుందని భావిస్తే ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి జోడో యాత్ర సాగిన రాష్ట్రాల్లోనే కొనసాగడం గమనార్హం. తాజాగా పార్టీకి సీనియర్ నాయకుడు రాజీనామా (Resignation) చేశాడు. పార్టీలో విలువలు లేవని ఆరోపణలు చేశాడు. అందుకే భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదని స్పష్టం చేశాడు.
భారత తొలి గవర్నర్ జనరల్ సి.రాజగోపాల చారి (C Rajagopalachari). స్వాతంత్ర్య సమరయోధుడు, ముఖ్యమంత్రిగా కూడా పని చేశాడు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి నాయకుడు. అతడి మనువడే సీఆర్ కేశవన్ (CR Kesavan). తమిళనాడుకు చెందిన కేశవన్ విదేశాల్లో విద్యాభ్యాసంతో పాటు ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే రాజకీయాల్లోకి రావాలని భావించాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విదేశాల నుంచి భారత్ కు వచ్చి 2000లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతూ వివిధ పదవుల్లో కొనసాగాడు. శ్రీపెరంబదూర్ లోని రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ లో ఉపాధ్యక్షుడిగా కొనసాగాడు. అనంతరం ప్రసార భారతి (Prasar Bharati) బోర్డు సభ్యుడిగా, యువజన కాంగ్రెస్ (Youth Congress) జాతీయ కమిటీలో పలు బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఇటీవల ఆయన పార్టీపై అసంతృప్తితో ఉన్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ జోడో యాత్ర తమిళనాడులో జరిగితే కేశవన్ పాల్గొనలేదు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉన్నాడు. తాజాగా గురువారం ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించాడు.
‘విదేశాల్లో విజయవంతమైన కెరీర్ ను వదిలేసి దేశ సేవ కోసం భారత్ కు వచ్చా. జాతీయ సమగ్రాభివృద్ధి కోసం పార్టీలో చేరా. పార్టీలో నా ప్రయాణం సాహసోపేతంగా సాగింది. రెండు దశాబ్దాలుగా నిస్వార్థంగా పని చేశా. కానీ ప్రస్తుతం పార్టీలో విలువలు లేవు. నాకు గౌరవం కూడా లేదు. ఈ క్రమంలోనే రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనలేదు. ఇప్పుడు కొత్త మార్గాన్ని అన్వేషించుకోవాలని భావిస్తున్నా. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఇతర పార్టీలో చేరే అంశంపై ఇప్పుడే ఏమీ చెప్పలేను’ అని రాజీనామా లేఖలో కేశవన్ తెలిపాడు. పార్టీలో యువజన నాయకుడిగా కేశవన్ కీలక స్థాయిలో ఉన్నాడు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. పార్టీకి పెద్ద దిక్కు లేదు. ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.