టర్కీని భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్ పై 7.8 గా భూకంపం నమోదైంది. ఈ భూకంప ధాటికి భవనాలు కుప్పకూలాయి. మనుషులు పిట్టల్లా రాలిపోయారు. కొన్ని వందల మంది ఈ భూకంప ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా…. టర్కీ భూకంప ఘటనపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
తక్షణమే సహాయక, మెడికల్ బృందాలను టర్కీ పంపాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను టర్కీ పంపిస్తున్నారు. అలాగే క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందిని కూడా టర్కీ పంపిస్తున్నారు.
గాయపడిన వారికి అవసరమైన ఔషధాలు, ఇతర సహాయక సామాగ్రి కూడా ఈ బృందాలు భారత్ నుంచి తీసుకెళ్తున్నాయి. ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో కనీసం వందమంది సిబ్బంది ఉంటారని వీరు టర్కీ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. డాగ్ స్క్వాడ్ కూడా ఎన్డీఆర్ఎఫ్ టీమ్‌తో వెళ్తోంది. మెడికల్ బృందాల్లో శిక్షణ పొందిన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఔషదాలు, ఇతర సహాయ సామాగ్రి కూడా తీసుకెళ్తున్నారు. టర్కీ ప్రభుత్వంతో పాటు అంకారాలోని భారత ఎంబసీతో పాటు ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ జనరల్ కార్యాలయంతో భారత బృందాలు సమన్వయం చేసుకుంటాయి.