ICMR Dietary Guidelines : రోజూ సమతుల ఆహారం తీసుకోవడం, తిన్న ఆహారానికి సరిపడినంత శారీరక శ్రమ చేయడం అనేవి చాలా బ్యాలెన్స్డ్గా చేసుకోవాల్సిన పనులు. అలా మనం సమతుల ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా, తగినంత శారీరక శ్రమ చేయకపోయినా రోగాలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్నే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) జాతీయ పోషకార సంస్థ ( NIN)లు చెబుతున్నాయని. ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలనే దానిపైనా గైడ్లైన్స్ ఇస్తున్నాయి. ఆ వివరాల ప్రకారం..
మనం రోజూ పోషకాహారాన్ని తీసుకోవాలి. అందుకు బదులుగా ప్రోసెస్ చేసిన ఆహారాలు, చక్కెరలు ఎక్కువగా ఉన్న పదార్థాల్లాంటి వాటికి దూరంగా ఉండాలి. చిప్స్, బర్గర్లు, పీజాలు, కూల్ డ్రింకుల్లాంటి వాటిని దగ్గరకు రానీయకూడదు. ఇలాంటివి తరచుగా తింటూ ఉండటం వల్ల బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధుల్లాంటివి రావొచ్చు.
కొందరు కండలు బలంగా పెరగాలన్న ఉద్దేశంతో ప్రొటీన్లను అతిగా తీసుకుంటూ ఉంటారు. ప్రొటీన్ పౌడర్లు, సప్లిమెంట్లను వాడుతుంఆరు. అలాంటి వారికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓ అధ్యయనం ప్రకారం ప్రొటీన్ పౌడర్లు ఎక్కువగా వాడే వారిలో మూత్ర పిండిల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అందుకనే వీటికి బదులుగా సహజంగా సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలి. రోజూ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తప్పకుండా తీసుకోవాలి. జ్యూస్లు తాగాలనుకుంటే పంచదార చేర్చకుండా తాగాలి. గుడ్లు, పాలు, సోయాబీన్స్, బఠాణీల్లాంటి వాటిని తీసుకోవాలి. టీ కాఫీలకు బదులుగా గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ లాంటి వాటిని అలవాటు చేసుకోవాలి. ఆహారాల్లో నూనె, తీపి, ఉప్పు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తప్పక తీసుకోవాలి.