Head Bath with Hot Water: మనలో ఎక్కువ మంది వేడి నీటితో స్నానం చేసేందుకే ఇష్ట పడుతూ ఉంటారు. చన్నీళ్ల స్నానం అంటే భయపడుతుంటారు. శీతాకాలం, వర్షాకాలం అయితే తల స్నానమైనా, ఒంటి స్నానమైనా చాలా మంది వేడి నీటితోనే చేస్తూ ఉంటారు. అయితే వేడి వేడి నీటితో తల స్నానం(Head Bath) చేయడం వల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ వేడి ఉండే నీటిని స్కాల్ప్‌పై పోసుకోవడం వల్ల అక్కడ సహజంగా ఉండే నూనెలన్నీ పోతాయి. ఫలితంగా జుట్టు పొడి బారిపోతుంది. జుట్టు చివళ్లు చిట్లిపోతాయి. ఫలితంగా జుట్టు అధికంగా రాలిపోవడం ప్రారంభం అవుతుంది.
ఎవరైనా ఎక్కువగా జుట్టు రాలిపోయే సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఈ విషయాన్ని కచ్చితంగా గమనించుకోవాలి. ఎక్కువ వేడి నీటితో(Hot Water) స్నానం చేస్తుంటే వెంటనే దాన్ని నిలిపివేయాలి. సాధ్యమైనంత వరకు చన్నీటితో(Cold Water) తల స్నానం చేయాలి. అలా కాని పక్షంలో కాస్త గోరు వెచ్చటి నీటితో మాత్రమే తల స్నానం చేయాలి. లేదంటే జట్టు కచ్చితంగా పాడవుతుంది. 2011లో ఈ విషయమై ఓ అధ్యయనం జరిగింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మొటిక్ డెర్మటాలజీలో దాంట్లోని వివరాలు ప్రచురితం అయ్యాయి.
చైనా, బీజింగ్‌లోని మెడికల్ యూనివర్సిటి ఆఫ్ పెకింగ్ వైద్యులు ఈ అధ్యయనం చేశారు. ఎక్కువ వేడిగా ఉండే నీటితో స్నానం చేయడం వల్ల జట్టులో తేమ తగ్గిపోతుందని తేల్చారు. సహజమైన నూనెల ఉత్పత్తి సైతం తగ్గిపోతుందన్నారు. ఫలితంగా జుట్టు పొడిబారిపోయి నిర్జీవంగా తయారవుతుందని చెప్పారు. అందువల్ల జుట్టు రాలిపోయే సమస్యలు పెరుగుతాయని వివరించారు. జుట్టు దృఢమైనదా? సున్నితమైనదా? అన్న అంశాల ఆధారంగా తలస్నానం ఎన్ని రోజులకు ఒకసారి చేయాలనేది నిర్ణయించుకోవాలని అన్నారు. గోరు వెచ్చటి నీటిని లేదా చన్నీటిని తల స్నానానికి ఉపయోగించడం శ్రేయస్కరమని పేర్కొన్నారు.