ఏపీ నేతలు చేతనైతే ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు సహా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రజల గురించి తాను ఎప్పుడూ కూడా తప్పుగా మాట్లాడలేదని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Harish Rao)పేర్కొన్నారు. తాను అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా పలువురు నేతలు ఎగిరెగిరి పడుతున్నారని దుయ్య బట్టారు. ఈ క్రమంలో ఏపీ నేతలు చేతనైతే విశాఖ ఉక్కు కోసం, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని హితవు పలికారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసుకుని కాలేశ్వరం లాగా నీళ్లు అందించాలని కోరారు. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇస్తామన్న అంశాన్ని కూడా ప్రస్తావించారు.
ఓ సందర్భంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి ఇక్కడే పనిచేస్తున్న ఏపీ కూలీలలతో ప్రస్తావించినట్లు చెప్పారు. తెలంగాణలో కరెంట్, నీళ్లు, పెన్షన్ వస్తున్నాయి ఇక్కడే ఉండుడి అని చెప్పినట్లు హరీశ్ రావు గుర్తు చేశారు. ఇది తెలియకుండా కొంత మంది నేతలు ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఇవాళ విశాఖ ఉక్కు కోసం ఏపీ ప్రభుత్వం ఎందుకు పోరాడటం లేదని హరీశ్ ప్రశ్నించారు.
దీంతోపాటు అభివృద్ధి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలతో పోల్చుకోవడం సహజమేనని అన్నారు. కర్ణాటకలో 7 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో బోరు బావుల వద్ద 24 గంటల కరెంట్ ఉంటుందని హరీశ్ రావు వెల్లడించారు. సిద్దిపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.