»Five People Died In Warangal While Going To Sell Honey
Warangal Road Accident: తేనె అమ్ముకునేందుకు వెళ్తుండగా ఘోరం..వరంగల్‌లో ఐదుగురు మృతి
వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్పాట్లో ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారంతా తేనె అమ్ముకునేవారిగా పోలీసులు గుర్తించారు.
వరంగల్(Warangal) జిల్లాలో దారుణం జరిగింది. తేనె అమ్ముకునేందుకు ఆటోలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని వర్దన్నపేట మండలం, ఇల్లంద గ్రామం వద్ద బుధవారం ఉదయం ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటుగా ఐదుగురు ప్రయాణికులు మృతిచెందారు.
పోలీసుల కథనం మేరకు..ఆటోను లారీ బలంగా ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఎనిమిది మంది ఉండగా వారిలో ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరు ప్రయాణీకులు ఆటోలో ఇరుక్కుపోగా వారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అంబులెన్స్ సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారంతా కూడా తేనె విక్రయించే వారిగా స్థానికులు గుర్తించారు. తేనెపట్టు అమ్ముకోవడం కోసం వారు ఆటోలో వరంగల్ వైపు నుంచి వర్దన్నపేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.