ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ 92 ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి మృత్యు ఒడిలోకి చేరారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను అపోల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేశారు కాశీనాథుని విశ్వనాథ్. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోక సముద్రంలో మునిగింది. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో ఆణిముత్యాలను అందించారు. కే విశ్వనాథ్ మరణించడానికి ముందు పాట రాస్తున్నారట. శంకరాభరణం సినిమా విడుదలై 43 ఏళ్లు. గురువారం (ఫిబ్రవరి 2) ఈ సినిమా విడుదలైన రోజు కావడంతో ఆయన ఆనందంగా ఉన్నారు. అదే సమయంలో ఓ పాట రాసే ప్రయత్నం చేయగా, తనకు సాధ్యం కాకపోవడంతో, తనయుడిని పిలిచి… తాను చెబుతుంటే రాయమని చెప్పారు. అలా రాస్తూనే సమస్య తలెత్తడంతో ఆసుపత్రికి తరలించారు.
k viswanath
కే విశ్వనాథ్ స్వస్థలం రేపల్లెలోని పెదపులివర్రు గ్రామం. 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. తండ్రి చెన్నైలోని విజయవాహిని స్టూడియోలో పని చేసేవారు. దీంతో విశ్వనాథ్ తన డిగ్రీ అనంతరం అక్కడే సౌండ్ రికార్డిస్ట్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన విశ్వనాథ్, 1965లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రానికి ఆయన నంది అవార్డు అందుకున్నారు. యాభైకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతి ముత్యం, శృతిలయలు, స్వర్ణకమలం, సూత్రదారులు, ఆపద్బాంధవుడు తదితర సినిమాలకు నంది అందుకున్నారు. శుభ సంకల్పం, స్వరాభిషేకం తదితర పలు సినిమాలకు ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. స్వాతిముత్యం, స్వయంకృషి సినిమాలు మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివెల్లో ప్రదర్శితమైంది. స్వాతిముత్యంసినిమా ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివెల్లో కూడా ప్రదర్శితమైంది. మరో ఘనత ఏమంటే ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి తెలుగు చిత్రం స్వాతిముత్యం. 1985లోనే ఈ ఘనత సాధించింది.
కే విశ్వనాథ్ దరిచేరిన అవార్డులు, రివార్డులు అన్నీ ఇన్నీ కావు. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు, పద్మశ్రీ, 2017లో దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 5 నేషనల్ ఫిల్మ్ అవార్డుసు, 7 నంది అవార్డులు, 10 ఫిలిమ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. 1981లో బేసన్కన్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ ఫ్రాన్స్ ఆయనను ప్రైజ్ ఆఫ్ పబ్లిక్‌తో గౌరవించింది. తెలుగుతో పాటు హిందీలోను సినిమాలు చేశారు. దర్శకుడిగానే కాకుండ నటుడిగా కూడా అందరినీ మెప్పించారు.