ఎంటర్టైన్మెంట్ దిగ్గజం, అతిపెద్ద మల్టీమీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ(Disney )సంస్థ 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ ఐగెర్(Bob Iger) బుధవారం నాడు ఈ మేరకు ప్రకటించారు. డిస్నీ కంపెనీ తన పని నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, ఖర్చులను తగ్గించడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది.
తిరిగి రాగానే..
అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర టెక్ దిగ్గజాలలో గందరగోళం వలె, డిస్నీ కూడా సవాలుతో కూడిన ఆర్థిక వాతావరణంలో కఠినమైన చర్యలు తీసుకుంటోంది. గత నవంబర్‌లో మాజీ CEO బాబ్ చాపెక్ నుంచి కంపెనీ CEO రాబర్ట్ ఐగర్(Bob Iger) బాధ్యతలు స్వీకరించారు. ఐగెర్ 2020లో తన పదవి నుంచి వైదొలగడానికి ముందు 15 సంవత్సరాల పాటు కంపెనీ CEOగా పనిచేశారు. అయితే అతను తిరిగి రావడంతో, కంపెనీ ఇప్పటికే ఉద్యోగుల ఖర్చులను తగ్గించాలనే నిర్ణయంతో సహా కొన్ని ముఖ్యమైన సంస్థాగత మార్పులను ప్రారంభించింది. ఈ క్రమంలో ఐగర్ తీసుకున్న మొదటి నిర్ణయం ఇదేనని పలువురు అంటున్నారు.
తగ్గిన సబ్స్క్రైబర్లు
ఇక ఈ సంస్థ త్రైమాసిక ఆదాయాల గురించి డిస్నీ అధికారికంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, కంపెనీ తన ప్రత్యర్థి నెట్‌ఫ్లిక్స్ మాదిరిగానే చందాదారుల వృద్ధి రేటులో భారీగా తగ్గుదలను చవిచూసింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ US, కెనడాలో కేవలం 200,000 మంది సబ్స్క్రైబర్లను మాత్రమే పెంచుకుంది. ఈ క్రమంలో మొత్తం 46.6 మిలియన్ సబ్స్క్రైబర్లకు చేరుకోవడం మరింత ఆందోళన కరంగా మారింది. మరోవైపు అంతర్జాతీయంగా, హాట్‌స్టార్ మినహా, స్ట్రీమింగ్ సేవలో 1.2 మిలియన్ల సభ్యులు పెరిగారు. దాని ఇతర ప్లాట్‌ఫారమ్‌లు, హులు, ESPN ప్లస్ సబ్‌స్క్రైబర్ రేట్లో గణనీయమైన వృద్ధి రేటును సాధించాయి.
సవాలుతో కూడిన పరిస్థితులు
ఈ క్రమంలో అనేక మంది ఉద్యోగుల కార్యకలాపాలు, సమన్వయం మరింత ఖర్చుతో కూడిన విధానమని ఐగెర్ ఒక కాన్ఫరెన్స్ కాల్లో భాగంగా విశ్లేషకులతో అన్నారు. కంపెనీ అంతటా 5.5 బిలియన్ డాలర్ల ఖర్చును ఆదా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. అందులో భాగంగానే దాదాపు 5 శాతం ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా సవాలుతో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థను సమర్థవంతంగా అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
2024 చివరి నాటికి!
2021 కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం డిస్నీ (Disney)లో ప్రపంచవ్యాప్తంగా 1,90,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 80 శాతం మంది పూర్తిస్థాయి ఉద్యోగులుగా ఉన్నారు. అయితే స్ట్రీమింగ్ వ్యాపారం శాశ్వత వృద్ధి, లాభదాయకత మా ప్రథమ ప్రాధాన్యత అని ఐగర్ చెప్పారు. మా ప్రస్తుత అంచనాల ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డిస్నీ ప్లస్ లాభదాయకతను సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ తొలగింపులతో ఏ విభాగాలపై ప్రభావం పడుతుందో డిస్నీ CEO మాత్రం వెల్లడించలేదు. డిపార్ట్మెంట్ల పునర్నిర్మాణం విషయానికొస్తే, ఇప్పుడు డిస్నీ ఎంటర్టైన్మెంట్, ఈఎస్పీఎన్ డివిజన్, పార్క్స్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొడక్ట్స్ యూనిట్ అనే మూడు విభాగాలుగా పునర్వ్యవస్థీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.