తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు.. రిక్రూట్ మెంట్ బోర్డు(telangana police recruitment board) నిర్వహించిన ఈవెంట్స్ టెస్టుల్లో భాగంగా పలువురు తాము హైట్(height) ఉన్నా కూడా దాదాపు 1 సెంటీమీటర్ తక్కువగా చూపించి తమను డిస్ క్వాలిఫై చేశారని పలువురు హైకోర్టును(telangana high court) ఆశ్రయించారు. దీంతో ఒక సెంటీమీటర్ కంటే తక్కువగా ఉండి డిస్ క్వాలిఫై చేసిన అభ్యర్థులకు మళ్లీ హైట్ ను కొలవాలని హైకోర్టు పోలీస్ బోర్డును ఆదేశించింది. ఈ క్రమంలో వారికి మళ్లీ ఈవెంట్స్(police events) నిర్వహించాలని వెల్లడించింది. దీనిపై సానూకూలంగా స్పందించిన పోలీస్ బోర్డు ఈ కారణంతో అర్హత కోల్పోయిన వారికి తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
మళ్లీ టెస్టులు
ఈ నేపథ్యంలో అర్హత కోల్పోయిన అభ్యర్థులు ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు TSLPRB వైబ్ సైట్లో ఆన్ లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపింది. వీరికి హైదరాబాద్ అంబర్ పేట సీపీఎల్ గ్రౌండ్(amberpet cpl ground), కొండాపూర్ 8వ బెటాలియన్ గ్రౌండ్లలో(kondapur 8th battalion ground) టెస్టులు నిర్వహించనున్నట్లు TSLPRB స్పష్టం చేసింది. ఈవెంట్లకు వచ్చే క్రమంలో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకుని తీసుకుని రావాలని, దానితోపాటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కొత్తగా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్, ఏదైనా ఐడెంటిటీ కార్డ్ జిరాక్స్ తప్పక తీసుకు రావాలన్నారు. అంతేకాదు చెప్పిన సమయం ప్రకారం టెస్టు కేంద్రాల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.
అసలు హైట్ ఎంత?
తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు పురుషులు అయితే 167.6 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. మహిళలు 152.2 సెంటీమీటర్లు ఉండాలి. కానీ ఎస్టీ, ఏజన్సీ ప్రాంత అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. కానీ గతంలో పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన కానిస్టేబుల్ సహా పలువురు ఎగ్జామ్ రాసిన వారిని సైతం ఈసారి ఎత్తు విషయంలో అనర్హులుగా గుర్తించారని అభ్యర్థులు వాపోయారు. ఈ క్రమంలో పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ఈ మేరకు తీర్పునిచ్చింది.
మేము కూడా కోర్టుకు వెళతాం
మరోవైపు గత పోలీస్ నోటిఫికేషన్లలో ఉన్నవాటి కంటె షాట్ పుట్(shot put), లాంగ్ జంప్(long jump) ఎక్కువ పరిమితి పెట్టారని మరికొంత మంది అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018 ఈవెంట్లలో తెలంగాణలో షాట్ పుట్(7.26 కేజీలు)-5.6 మీటర్లు వేసిరితే అర్హులు, కానీ ఈసారి ఈవెంట్లలో మాత్రం దానిని ఏకంగా 6 మీటర్లకు పెంచారు. దీంతో అనేక మంది అభ్యర్థులు అనర్హులుగా మిగిలిపోయారు. ఇక లాంగ్ జంప్ కూడా 2018లో 3.80 మీటర్లు దూకిన వారు అర్హులుగా ఉండగా, ఈసారి మాత్రం 4 మీటర్లకు పొడిగించారు. ఈ రెండు ఈవెంట్ల కారణంగా కూడా అనేక మంది పోలీస్ ఉద్యోగార్థులు డిస్ క్వాలిఫై అయ్యారు. దీంతో రన్నింగ్ మాత్రమే క్వాలిఫై అయిన వారికి సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్ఐ సహా కొన్ని పోస్టులకు ఫైనల్ పరీక్ష రాసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. లేదంటే తాము కూడా హైకోర్టులో కేసు వేస్తామని అంటున్నారు.