మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల సపోర్టు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులు ఎవరికి సపోర్ట్ చేస్తారా అని అందరూ ఎదురు చూస్తుండగా… దానిమీద సస్పెన్స్ వీడింది. తాము తెలంగాణ రాష్ట్ర సమితికే మద్దతునిస్తామని సీపీఐ నేత నారాయణ ఇదివరకే ప్రకటించారు. మునుగోడు ఎన్నికలో బీజేపీని ఓడించాలంటే ఈ పార్టీకే సపోర్ట్ ఇస్తామని ఆయన చేసిన ప్రకటననే ఇప్పుడు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా తమదీ అదే దారన్నట్టు స్పష్టం చేశారు.
మా లక్ష్యం భారతీయ జనతా పార్టీ ఓటమేనని అన్నారు. కానీ, టీఆర్ఎస్ కు తమ మద్దతు ఈ మునుగోడు ఎన్నికకు మాత్రమే పరిమితమని, ప్రభుత్వ వైఫల్యాలపై తాము పోరాడుతూనే ఉంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ..రాజకీయంగా బీజేపీని ఎదుర్కొంటామని అన్నారు.
నిజానికి తమకు మద్దతునివ్వాలని తెరాస నుంచే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా విజ్ఞప్తి అందిందని, అయితే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మునుగోడులో బీజేపీని ఓడించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు వీరభద్రం చెప్పారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్నా ఉప ఎన్నికలో అది మూడో స్థానానికి పడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలోని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూనే ఉంటామని, వీటిపై తమ పోరాటం మాత్రం ఆగదన్నారు వీరభద్రం. బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉందని భావిస్తే ఆ పార్టీకే మద్దతునిచ్చేవాళ్లమని ఆయన వెల్లడించారు.. ‘సీఎం కేసీఆర్ మమ్మల్ని ప్రేమిస్తున్నాడని అనుకోవడం లేదు’ అని తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. బీజేపీ తమకు శాశ్వత శత్రువని స్పష్టం చేశారు.