»Brs Again Trs Kadiam Sriharis Key Comments On Name Change
Kadiam Srihari: బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్గా మారనుందా?
తెలంగాణ ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రాజకీయ పార్టీగా మారిన టీఆర్ఎస్ రెండు పర్యాయాలు నూతన రాష్ట్రాన్ని పాలించింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత్ రాష్ట్ర సమితిగా మార్చుకుంది. తరువాత సొంత రాష్ట్రంలోనే చిత్తయింది. దీంతో మళ్లీ పాత పేరుతోనే రాజకీయం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.
BRS again TRS.. Kadiam Srihari's key comments on name change
Kadiam Srihari: టీఆర్ఎస్(TRS) పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం అని బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ ఎన్నోసార్లు బహిరంగ సమావేశాల్లో చెప్పారు. అలా ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారీ రెండు పర్యాయాలు దిగ్విజయంగా పాలన సాగించింది. ఇక జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చింది. ఆ క్రమంలో తెలంగాణలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పొందింది. దీనికి కారణం ఏదైనా, పార్టీ పేరు మార్పు కూడా ఒక కారణం అని పార్టీ శ్రేణులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో మళ్లీ తెలంగాణ అస్థిత్వం ప్రజలకు గుర్తు చేయాలని టీఆర్ఎస్గా మార్చాలని పార్టీ వర్గాలు కోరాయి. దీనిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ ముందుగానే పావులు కదుపుతుంది. దానిలో భాగంగా నియోజకవర్గ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. బుధవారం తెలంగాణ భవన్లో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్విహించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇతర ముఖ్యనేతలతో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు. సీనియర్ నేత కడియం మాట్లాడుతూ పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు. అలా కొందమంది ప్రజలు దూరమై ఉంటారని, వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కడియంతో పాటు పార్టీ నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లబుచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని కేసీఆర్(KCR) దృష్టికి తీసుకెళ్లి చర్చించాలని కేటీఆర్(KTR)ను కోరినట్లు తెలుస్తుంది. దీనిపై కేటీఆర్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.