»Ayodhya Ram Mandir Large Gifts To Ayodhya From Abroad
Ayodhya Ram Mandir: దేశవిదేశాల నుంచి అయోధ్యకు పెద్ద ఎత్తున బహుమతులు
అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగబోతుంది. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశ, విదేశాల నుంచి ప్రత్యేక బహుమతులను తీసుకొస్తున్నారు. మరి ఆ బహుమతులు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకుందాం.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగబోతుంది. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు దేశ, విదేశాల నుంచి ప్రత్యేక బహుమతులను తీసుకొస్తున్నారు. శ్రీరాముని ధర్మపత్ని సీతమ్మ జన్మస్థలం నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి 3000కు పైగా బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి. ఇందులో వెండి పాదుకలు, ఆభరణాలు, దుస్తులు వంటివి ఉన్నాయి. గుజరాత్‌లోని వడోదర నివాసి విహా భర్వాడ్ 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పుగల అగరుబత్తీని తయారు చేశారు. దీని బరువు 3610 కేజీలు ఉన్నట్లు తెలిపారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి 44 అడుగుల పొడవైన కంచు ధ్వజ స్తంభం, మరో ఆరు చిన్న ధ్వజ స్తంభాలను తీసుకొచ్చారు. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి తన తండ్రి కలను నెరవేర్చడం కోసం దాదాపు 8000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బంగారు పూత పూసిన పాదుకలను అయోధ్యకు పంపించారు. గుజరాత్‌లోని వడోదరకు చెందిన రైతు అరవింద్ భాయ్ మంగళ్ భాయ్ పటేల్ 1100 కేజీల భారీ దీపాన్ని తయారు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన సత్యప్రకాశ్ శర్మ 400 కేజీల బరువైన తాళం బహుకరిస్తున్నారు.
ఎనిమిది లోహాలతో తయారు చేసిన 2100 కేజీల బరువైన గంటను తయారు చేశారు. లక్నోలోని ఓ కూరగాయల వ్యాపారి ప్రత్యేకంగా ఓ గడియారాన్ని తయారు చేశారు. దీనిలో ఎనిమిది దేశాల సమయం ఒకేసారి కనిపిస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం 7000 కేజీల రామ్ హల్వాను తయారు చెఫ్ విష్ణు మనోహర్ ప్రకటించారు. సూరత్‌లోని ఓ వజ్రాల వ్యాపారి రామాలయం థీమ్‌తో రెండు కేజీల వెండి, 5000 అమెరికన్ వజ్రాలతో ఓ నెక్లెస్‌ను తయారు చేయించి రామ జన్మభూమి ట్రస్ట్‌కు అందజేశారు.