»Corona Tension Again In India One In Up Four In Kerala Died
Corona: భారత్లో మళ్లీ కరోనా టెన్షన్..యూపీలో ఒకరు, కేరళలో నలుగురు మృతి
తగ్గిపోయాయని అనుకున్న కరోనా కేసులు మళ్లీ పడగవిప్పుతున్నాయి. తాజాగా కరోనా వల్ల ఐదుగురు ప్రాణాలు వదిలారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే కరోనాతో నలుగురు మరణించినట్లు కేంద్రం వెల్లడించింది.
ఇండియాలో కరోనా టెన్షన్ మళ్లీ మొదలైంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 335 కొత్త కరోనా కేసులు నమోదవ్వడంతో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో ఐదుగురు కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,701గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మృతిచెందినవారిలో నలుగురు కేరళ వాసులు, ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి ఉన్నారు. మరణాల సంఖ్య 5కు చేరడంతో వైద్యులు తలలుపట్టుకుంటున్నారు.
కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా మొత్తం 4.50 కోట్ల కరోనా కేసులు వెలుగుచూడగా అందులో 4.46 కోట్ల మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. జాతీయ సగటు రికవరీ రేటు 98.81 శాతంగా నమోదు కాగా కోవిడ్ మరణాల సంఖ్య 5,33,316గా ఉంది. అంతేకాకుండా ఇప్పటివరకూ 220.67 కోట్ల కోవిట్ టీకా డోసులు పంపిణీ చేసినట్లుగా కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది.
కేరళ రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతిచెందడంతో ఆ రాష్ట్ర వైద్యశాఖ అలర్ట్ అయ్యింది. కేరళలో ఈ మధ్యనే కొత్త కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 వెలుగు చూసిన సంగతి తెలిసిందే. సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియమ్ జరుపుతున్న అధ్యయనంలో ఈ విషయం వెలుగుచూసింది. కన్సార్షియం జరిపిన జీనోమిక్ పరీక్షల్లో 79 ఏళ్ల మహిళ జేఎన్.1 సబ్ వేరియంట్ బారిన పడ్డట్టు తేలింది. దీంతో వైద్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యి ప్రత్యేక చర్యలు చేపట్టాయి.