Chandrayaan-3: చంద్రయాన్-3 (Chandrayaan-3) రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన ఎల్వీఎం-3, ఎం-4 రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఇస్రోలో సంబరాలు మిన్నంటాయి. శాస్త్రవేత్తలు ఒకరికొకరు అభినందనలు చెప్పుకున్నారు. జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం చేపట్టింది. మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలో గల షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్తో కూడిన చంద్రయాన్-3 యాత్రలో భాగంగా శక్తిమంతమైన రాకెట్ జాబిల్లి వద్దకు వెళుతోంది.
రాకెట్ చంద్రయాన్-3ని (Chandrayaan-3) భూమి చుట్టూ ఉన్న 170* 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. 24 రోజుల పాటు భూమి చుట్టూ తిరుగుతుంది. తర్వాత క్రమంగా కక్ష్యను విజయవంతంగా పెంచుతూ చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్-3ని పంపిస్తారు. పలు ప్రక్రియల తర్వాత చంద్రుడి చుట్టూ 100 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెడతారు. ఆగస్ట్ 23 లేదా 24వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్‌తో కూడిన మాడ్యూల్ విడిపోయి.. చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో సుమారు 70 డిగ్రీల దక్షిణ ఆకాంక్షం వద్ద దిగనుందని ఇస్రో వెల్లడించింది.