బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరు అని ఈ ఇద్దరు నేతలు చాటారు. రాజకీయపరంగా కొట్లాడాలి కానీ కుటుంబపరంగా కలిసి ఉండాలని.. మిత్రులపరంగా కూడా కలిసి ఉండాలనేది వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైఎస్సార్ తో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడేవారు. వీరిద్దరూ రాజకీయంగా యుద్ధమే చేసేవాళ్లు. కానీ రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు.
రాజకీయాల్లో బద్ద శత్రువులు, ఆప్తమిత్రులు అనేవి సహజం. కానీ అవి పరిణామాలను బట్టి మారిపోతుంటాయి. కాకపోతే ఉప్పునిప్పులా ఉండే వారు ఒక్కసారిగా కలవడం మాత్రం చాలా అరుదు. నిత్యం పరస్పరం విమర్శలు చేసుకోవడం.. దారుణంగా తిట్టి పోసుకోవడం వంటివి చేసుకునే నాయకులు కలిసిపోవడం ఆశ్చర్యమే కనిపిస్తుంది. పార్టీలు, జెండాలు వేరు చేసుకుని బంధుత్వంతో కలుసుకోవడం ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలకు వింత కనిపిస్తుంటుంది. అలాంటి పరిణామమే తాజాగా చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) పరస్పరం కలుసుకున్నారు. పక్కన పక్కన కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకోవడం.. మీడియా (Media) ముందుకు ఇద్దరు కలిసి ముందుకు రావడం ప్రజల్లో ఆసక్తి కలిగించింది.
తెలుగుదేశం పార్టీ నాయకుడు, నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) కన్నుమూశాడు. అతడి పార్థీవదేహం హైదరాబాద్ (Hyderabad) శివారు మోకిల (Mokila)లోని నివాసంలో ఉంచారు. తారకరత్నను అంజలి ఘటించేందుకు చంద్రబాబునాయుడు వచ్చాడు. తారకరత్న చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ క్రమంలో అక్కడే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయనతో చంద్రబాబు కాసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ప్రెస్ మీడియా, సోషల్ మీడియా దేన్నీ వదలకుండా చంద్రబాబుపై నిరంతరం విమర్శలు, తిట్ల దండకం చేసే విజయసాయి చంద్రబాబుతో చాలా సేపు మాట్లాడడం అక్కడ ఉన్నవారినే కాదు టీవీలు చూస్తున్నవారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
తారకరత్న పరంగా చూస్తే చంద్రబాబు, విజయసాయిరెడ్డి దూరపు బంధువులు అవుతారు. వీరిద్దరూ అన్నదమ్ముల వరుస అవుతుంది. తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్న అలేఖ్య రెడ్డి ఎవరో కాదు. విజయసాయిరెడ్డి మరదలి కూతురు. అందుకే తారకరత్న ప్రమాదం నుంచి మృతి చెందే వరకు అతడి కుటుంబం వెంట విజయసాయిరెడ్డి ఉంటున్నారు. అంత్యక్రియలకు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య రెడ్డి తరఫున విజయసాయి రెడ్డి మొత్తం చూసుకుంటున్నారు. ఇక చంద్రబాబుకు తారకరత్న దగ్గరి బంధువు. ఈ విధంగా చంద్రబాబు, విజయసాయి బంధువులయ్యారు.
అయితే ఏం మాట్లాడుకుని ఉంటారని అందరూ ఆలోచిస్తున్నారు. వారిద్దరూ రాజకీయాలు తప్ప కుటుంబపర విషయాలు చర్చించుకున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ కు పార్థీవదేహం చేరుకోవడం, అంత్యక్రియలు తదితర అంశాలు మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇక మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు మాట్లాడే సమయంలో కూడా విజయసాయిరెడ్డి పక్కన ఉన్నాడు. రాజకీయాలు వదిలేసి ఇలా నాయకులు పక్కపక్కన ఉండడం ఇరు పార్టీల శ్రేణులు ఆసక్తిగా గమనించాయి.
బంధుత్వాలు వేరు.. రాజకీయాలు వేరు అని ఈ ఇద్దరు నేతలు చాటారు. రాజకీయపరంగా కొట్లాడాలి కానీ కుటుంబపరంగా కలిసి ఉండాలని.. మిత్రులపరంగా కూడా కలిసి ఉండాలనేది వాస్తవం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా వైఎస్సార్ తో చంద్రబాబు ఆప్యాయంగా మాట్లాడేవారు. వీరిద్దరూ రాజకీయంగా యుద్ధమే చేసేవాళ్లు. కానీ రాజకీయాలను పక్కన పెడితే వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు. పరస్పరం తిట్టుకున్నవాళ్లే ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.