»Central Election Commission Separate App For Campaign Expenditure Of Candidates
Election commission: అభ్యర్థుల ప్రచార ఖర్చు కోసం స్పెషల్ యాప్
ఈ ఏడాది తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు గురించి సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. సరికొత్త యాప్ రూపొందించి వారి ఖర్చులను అంచనా వేయనున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుపై మరింత నిఘా పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(election commission) నిర్ణయించింది. నానాటికీ పెరిగిపోతున్న ఎన్నికల ఖర్చుపై(campaign expenditure) నిఘా పెంచేందుకు రంగం సిద్ధమైంది. అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘం షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ పేరుతో నమోదు చేస్తుంది. ఇందుకోసం ‘అభ్యర్థుల వ్యయ మానిటరింగ్ సిస్టమ్’ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ను ఈసీ సిద్ధం చేసింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అక్కడి అభ్యర్థుల ఖర్చులను పర్యవేక్షించేందుకు ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని బలోపేతం చేసేందుకు సూచనలు ఇవ్వాలని ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను కోరారు.
ఎన్నికల ఖర్చుల వివరాలను అభ్యర్థులు నిర్దిష్ట కాలవ్యవధిలోగా EC అధికారులకు సమర్పిస్తారు. ఆ కాగితాలు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తనిఖీలు నిర్వహించడం ప్రహసనమని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో నిఘా పెంచేందుకు ప్రచార వ్యయాన్ని 10 కేటగిరీలుగా కేంద్ర ఎన్నికల సంఘం విభజించింది. ఇందులో ఆ సెక్షన్ల కింద 50 అంశాలు ఉన్నాయి. అభ్యర్థులకు సొంత పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు, సోషల్ మీడియా సంస్థలు ఉంటే వాటిల్లో జరిగే ప్రచార ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారానికి వినియోగించే వ్యక్తుల రెమ్యునరేషన్, రోజువారీ ఖర్చులను లెక్కిస్తారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బు, వివిధ రూపాల్లో పంపిణీ చేసిన వస్తువులను ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల్లో నమోదు చేయనున్నట్లు సమాచారం. త్వరలో 5 రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త సాఫ్ట్వేర్ను అమలు చేసేందుకు సీఈసీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.