»Flood Water Hit The Taj Mahal For The First Time In 45 Years
Video Viral: 45 ఏళ్లలో మొదటిసారి తాజ్‌మహల్‌ను తాకిన వరద నీరు!
గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా తాజ్ మహల్ కట్టడంలోకి యమునా నది వరద నీరు చేరింది. అయితే వరద నీరు వల్ల తాజ్ మహల్ కు ఎటువంటి ముప్పు లేదని అధికారులు ప్రకటించారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలకు ఆయా రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకల్లో వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో యమునా నది(Yamuna River) ఉప్పొంగింది. గత 45 ఏళ్లలో చారిత్రక కట్టడమైన తాజ్ మహల్(Taj Mahal) పరిసరాల్లోకి యమునా నది వరద నీరు ప్రవేశించడం ఇదే మొదటిసారి. తాజ్‌మహల్ గోడల్లో, గార్డెన్లో ఇప్పటి వరకూ ఇంత భారీగా వరద నీరు వచ్చి చేరలేదు. తాజా పరిస్థితుల వల్ల తాజ్ మహల్ పరిసర ప్రాంతాల్లో భారీగా వరదనీరు నిలిచింది.
తాజ్‌మహల్(Taj Mahal) దగ్గర యమునా నది(Yamuna River) వరద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 495 అడుగులను దాటి 497.9 అడుగులకు చేరుకోవడంతో వరదనీరు తాజ్‌మహల్ పరిసరాల్లోకి చేరింది. అయితే ఈ వరదనీరు వల్ల తాజ్‌మహల్‌కు ఎటువంటి ముప్పు ఉండదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులు వెల్లడించారు.
కుండపోత వర్షాల వల్ల యమునా నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో వరద నీరు భారీగా పొంగిపొర్లుతోంది. దీంతో యమునా పరివాహకంలోని పలు లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తగా అధికారులు అలర్ట్ అయ్యారు. గతంలో 1978లో యమునా నది వరదల వల్ల తాజ్ మహల్(Taj Mahal) ప్రాంతంతో తీవ్ర ఇబ్బంది నెలకొంది. దాదాపు 508 అడుగుల ఎత్తులో యమునా నది(Yamuna River) ప్రవహించడంతో తాజ్‌మహల్ బేస్మెంట్లోని 22 గదుల్లోకి వరద నీరు చేరి అలజడి రేపింది. ఆ ఘటన తర్వాత ఆ స్థాయిలో కాకున్నా తాజ్‌మహల్ పరిసరాల్లోకి వరదనీరు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.