»Brs Party Leader Challenges To Raja Singh In Goshamahal
Flexis కలకలం.. రాజా సింగ్ కు రూ.1000 కోట్ల సవాల్
ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలు పక్కన పడేసి మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ముందే అభివృద్ధిలో వెనుకబడిన గోషామహల్ పై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యాడు.
పాతబస్తీ (Old City)లో సరికొత్త రాజకీయం మొదలైంది. గోషామహాల్ (Goshamahal) బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh)కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) చర్యలు మొదలుపెట్టింది. ఈసారి ఎలాగైనా రాజాసింగ్ ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల రాజా సింగ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంత డబ్బులు వెదజల్లినా గోషామహల్ లో మళ్లీ గెలిచేది తానేనని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాషాయ జెండానే మళ్లీ రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అయితే దీనికి అక్కడి స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సంచలన సవాల్ విసిరాడు. ఈ సందర్భంగా రాజా సింగ్ సవాల్ కు ప్రతిగా నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. రూ.1000 కోట్ల సవాల్ కు సిద్ధమని ప్రకటించాడు. ఈ పరిణామం హైదరాబాద్ (Hyderabad)లో రాజకీయంగా హాట్ టాపిక్ గా నిలిచింది.
2018 ఎన్నికల్లో హైదరాబాద్ లో బీజేపీ నుంచి గెలిచింది రాజా సింగ్ మాత్రమే. హైదరాబాద్ లోనే కాదు మొత్తం తెలంగాణ (Telangana)లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది రాజా సింగ్ ఒక్కరే. గోషామహల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్ తీరు వివాదాస్పదంగా మారింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల అమలు పక్కన పడేసి మతపరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ముందే అభివృద్ధిలో వెనుకబడిన గోషామహల్ పై దృష్టి సారించకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలు పాలయ్యాడు. అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చాడు. అభివృద్ధి పట్టని రాజా సింగ్ ను కాదని గోషామహల్ లో గులాబీ జెండా ఎగురుతుందని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి రాజా సింగ్ సవాల్ చేశాడు. ఎన్ని కోట్లు వెదజల్లినా గెలిచేది తానేనని రాజా సింగ్ ప్రకటించాడు. అయితే రాజా సింగ్ సవాల్ కు ప్రతిగా బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రతి సవాల్ చేశాడు.
ఈ సందర్భంగా రాజా సింగ్ కు సవాల్ చేస్తున్న ఫ్లెక్సీలను గోషామహల్ నియోజకవర్గంలోని కోఠి (Koti), అబిడ్స్ (Abids), మొజంజాహి మార్కెట్ (MJ Market), సీబీఎస్, జుమ్మెరాత్ బజార్ ప్రధాన చౌరస్తాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు. రాజాసింగ్ వెయ్యి పొర్లు దండాలు పెట్టినా.. రూ.1000 కోట్లు పంచినా అతడికి ఓట్లు వేయరు అని ఫ్లెక్సీల్లో ఉంది. రాజా సింగ్ తొమ్మిదేళ్లలో గోషామహల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ఫ్లెక్సీల్లో సవాల్ విసిరారు. హిందూత్వం, మతం పేరును అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాడని శ్రీనివాస్ యాదవ్ బ్యానర్ల రూపంలో ప్రశ్నించాడు. ‘ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే స్పీచ్ ఇస్తారు.. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. రాజకీయ పబ్బం గడుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గోషామహల్ ప్రజలు రాజా సింగ్ ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల సమస్యల కోసం ఎమ్మెల్యే రాజా సింగ్ ఎన్నడూ అందుబాటులో ఉండడు. గోషామహల్ ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తారు’ అని శ్రీనివాస్ యాదవ్ పేర్కొంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు. ఈ ఫ్లెక్సీలు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపాయి.