Producer TG Viswa Prasad: ‘బ్రో’ మూవీ నిర్మాత ఇంట విషాదం
బ్రో మూవీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తల్లి మరణించారు. విశ్వప్రసాద్ మాతృమూర్తి గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్(Producer TG Viswa Prasad) తల్లి గీతాంజలి కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెను శుక్రవారం మరణించారు. తన చివరి కోరిక మేరకు కుటుంబీకులు ఆమెను వారణాసి తీసుకెళ్లారు. అక్కడే శుక్రవారం సాయంత్రం ఆమె తుది శ్వాసవిడిచినట్లు తెలుస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్ ఇంట విషాదం నెలకొనడంతో ఆయన తల్లి మృతి పట్ల సోషల్ మీడియాలో పలువురు సెలబ్రెటీలు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
జనసేన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) కూడా తాజాగా సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలిపారు. ‘సినీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాతృమూర్తి గీతాంజలి శివైక్యం చెందారని తెలిసి చింతిస్తున్నాను. గీతాంజలి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. విశ్వ ప్రసాద్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని పవన్ ట్వీట్ చేశారు. విశ్వ ప్రసాద్ తల్లి అంత్యక్రియలు కూడా వారణాసిలోనే నిర్వహించనున్నట్లు కుటుంబీకులు వెల్లడించారు.
ప్రస్తుతం టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాణ సారధ్యంతో బ్రో మూవీ(BRO Movie) తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా సాగనున్నాయి.