తెలంగాణ మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ఆయనను… కొందరు యువకులు అడ్డుకోవడం గమనార్హం. ఒక్కసారి కాదు… రెండుసార్లు ఆయనను ఇలా అడ్డుకోవడం గమనార్హం.
పిట్లం మండలంలో 30 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కాగా… ఆ సమయంలో.. బీజేపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు.. ఆందోళన కారులను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి.. బిచ్కుందకు వచ్చిన మంత్రి హరీశ్ రావు.. ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభించేందుకు రాగా.. అక్కడ కూడా మంత్రి కాన్వాయ్‌ను కొందరు యువకులు అడ్డుకున్నారు.
నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ పిట్లం మండలంలో బీజేపీ యువమోర్చా నేతలు ఆందోళన చేపట్టారు. మంత్రి హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలతో కాన్వాయ్ ఎదుట ఆందోళనకు దిగారు. హరీష్ రావును అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువకుల ఆందోళనతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించటంతో.. పరిస్థితి సద్దుమణిగింది.