»Bjp Means Telangana Minister Harish Rao Gives New Abbreviation
LPG Price Hike బీజేపీ అంటే కొత్త అర్థం చెప్పిన మంత్రి హరీశ్ రావు
బీజేపీకి అదానీతో సంబంధం ఉంది కానీ, ఆమ్ ఆద్మీతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. బీజేపీ అంటే.. భారత జనులను పీడించే పార్టీ. గల్లి మీటింగ్ కి వచ్చే బీజేపీ నాయకులను తరిమికొట్టాలి. అన్ని సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) (Bharat Rashtra Samithi-BRS Party) పోరాటం ఉధృతం చేసింది. జాతీయ రాజకీయా (National Politics)ల్లోకి ప్రవేశించిన అనంతరం బీజేపీపై దూకుడు పెంచింది. తాజాగా ఎల్పీజీ గ్యాస్ ధరల (LPG Gas Price Hike) పెంపును అస్త్రంగా చేసుకుంది. గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ సిలిండర్ రూ.350 మేర పెంచడంపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనల (Protest)కు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపు కూడా ఆందోళనలు కొనసాగనున్నాయి. ఈ ఆందోళనల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు (T Harish Rao) నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ (BJP)కి కొత్త అర్థం చెప్పారు. బీజేపీ భారత జనులను పీడించే పార్టీగా మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు.
గ్యాస్ ధరల పెంపుపై మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా (Medchal-Malkajgiri District) ఘట్ కేసర్ (Ghatkesar)లో గురువారం నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘నాడు గ్యాస్ ధరలు రూ.400 ఉంటే అప్పటి బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారు. స్మృతి ఇరానీ (Smriti Irani) గ్యాస్ బండతో రోడ్ల మీద ధర్నా చేసింది. ఇప్పుడు అదే స్మృతి ఇరాని కేంద్ర మంత్రిగా ఉంది. పేదల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసింది. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. తరచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతోంది. సిలిండర్ పై మళ్లీ ధరలు పెంచడం దారుణమైన చర్య. రెండు లక్షల 14 వేల కోట్ల రూపాయలను యూపీఏ ప్రభుత్వం హయాంలో సబ్సిడీ కింద ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం 40,000 కోట్ల రాయితీ ఇస్తుందంటే ఎంత తగ్గించిందనేది అర్థమవుతుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద రూ.350 రాయితీ ఉంటే క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు సున్నా చేశారు. దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. చాయ్ బండి కాడ చర్చ పెట్టండి రూ.400 సిలిండర్ ఈరోజు రూ.1100 చేశామని చెప్పండి’ అంటూ మంత్రి హరీశ్ రావు బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు.
‘ప్రధానమంత్రి ఎందుకు చాయ్ పే చర్చ (Chai pe Charcha) పెడుతున్నారు. సిలిండర్ ధరలు పెంచడం వల్ల చాయ్ అమ్ముకునే వారిపై భారం పడ్తలేదా? ఎన్నికలు అయిపోయాక ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం అనవాయితీగా మారింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర లో ఎన్నికలు అలా అయిపోయాయో లేదో మళ్లీ ధర పెంచారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు వస్తున్నాయి.. ఇగ అవి అయిపోగానే మళ్లీ పెంచుతారు. బీజేపీ అచ్చే దిన్ అంటే గిట్ల ఉంటది. మీ పాలన అచ్చే దిన్ కాదు మీ ధరల పెరుగుదల చూసి సామాన్యుడు భయపడి రోజు సచ్చేదిన్ అవుతున్నది. బీజేపీకి అదానీతో సంబంధం ఉంది కానీ, ఆమ్ ఆద్మీతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. బీజేపీ అంటే.. భారత జనులను పీడించే పార్టీ. గల్లి మీటింగ్ కి వచ్చే బీజేపీ నాయకులను తరిమికొట్టాలి. అన్ని సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి’ అని మంత్రి హరీశ్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.