»Brs Leaders Telangana Statewide Protest On Lpg Gas Price Hike
BRS Party గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ భగ్గు.. రోడ్లెక్కిన గులాబీ శ్రేణులు
పేదల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసింది. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. తరచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతోంది. సిలిండర్ పై మళ్లీ ధరలు పెంచడం దారుణమైన చర్య.
కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ (LPG Gas) ధరలను పెంచడంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ BRS Party) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చాక గ్యాస్ ధరలు దాదాపు రూ.600కు పైగా ధర (Gas Price Hike) పెంచడంపై మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) పాలనను తప్పుబడుతూ గురు, శుక్రవారాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. రెండు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KT Rama Rao) పార్టీ పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు తెలంగాణవ్యాప్తంగా (Telangana) గులాబీ శ్రేణులు రోడ్లపైకి చేరారు. ఖాళీ సిలిండర్లతో తీరొక్క రీతిన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలు తగులబెట్టారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం గృహ అవసరాల సిలిండర్ ధరను రూ.50, కమర్షియల్ సిలిండర్ రూ.350 మేర పెంచింది. దీంతో సామాన్యుడితో పాటు మధ్య తరగతి ప్రజలపై మోయలేని భారం పడింది. దీన్ని నిరసిస్తూ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు రోడ్లపైకి చేరారు. ఎల్బీనగర్ (LB Nagar) చౌరస్తాలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసనలు చేపట్టారు. వంట మానేసి నానబెట్టిన బియ్యం తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద మంత్రి మహమూబద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన కొనసాగింది.
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. సికింద్రాబాద్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. కట్టెల పొయ్యిపై వంట చేసి నిరసన తెలిపారు. ‘ధరలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న బిజెపికి అధికారంలో ఉండే అర్హత లేదు. ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం. రేపు అన్ని డివిజన్ లలో ధర్నాలు, నిరసనలు కొనసాగుతాయి. 8 సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం రూ.745 గ్యాస్ ధర పెంచింది. ప్రజలపై మోయలేని భారం మోపుతున్న బీజేపీ నేతలను అడ్డుకోవాలి’ అని ఈ సందర్భంగా మహిళలకు మంత్రి తలసాని పిలుపునిచ్చారు.
ఇక మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (T Harish Rao) పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘పేదల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసింది. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది. తరచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతోంది. సిలిండర్ పై మళ్లీ ధరలు పెంచడం దారుణమైన చర్య. రెండు లక్షల 14 వేల కోట్ల రూపాయలను యూపీఏ (UPA Govt) ప్రభుత్వం హయాంలో సబ్సిడీ కింద ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం 40,000 కోట్ల రాయితీ ఇస్తుందంటే ఎంత తగ్గించిందనేది అర్థమవుతుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద రూ.350 రాయితీ ఉంటే క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు సున్నా చేశారు. దేశంలో వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి’ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రేపు అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలు చేపట్టనుంది.