»Cpr Telangana Constable Saved A Life With Cpr In Bhupalpally District
CPRతో దక్కిన మరో ప్రాణం.. శభాష్ కానిస్టేబుల్ కిరణ్
ఉన్నట్టుండి మనుషులు కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణం పొందుతున్నారు. ఇటీవల తరచూ ఇవే సంఘటనలు చోటుచేసుకుంటుండడం అందరినీ కలచి వేస్తోంది. ఇలా అకస్మాత్తుగా కూలుతున్న వారిని ఆదుకునేది సీపీఆర్ (Cardiopulmonary Resuscitation -CPR) విధానం. ఆపత్కాలంలో వారి ప్రాణం నిలిపేది సీపీఆర్.
మానవ శరీరం (Human Body)లో ఏం జరుగుతుందో ఏమో తెలియడం లేదు. ఉన్నట్టుండి మనుషులు కుప్పకూలుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణం పొందుతున్నారు. ఇటీవల తరచూ ఇవే సంఘటనలు చోటుచేసుకుంటుండడం అందరినీ కలచి వేస్తోంది. ఇలా అకస్మాత్తుగా కూలుతున్న వారిని ఆదుకునేది సీపీఆర్ (Cardiopulmonary Resuscitation -CPR) విధానం. ఆపత్కాలంలో వారి ప్రాణం నిలిపేది సీపీఆర్. ఇటీవల హైదరాబాద్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ (Traffic Constable) ఓ యువకుడి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో కానిస్టేబుల్ సీపీఆర్ విధానంతో మరొకరి ప్రాణం కాపాడాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally District)లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
జయశంకర్ జిల్లా రేగొండ (Regonda) మండల కేంద్రంలోని ఓ చికెన్ సెంటర్ లో వంశీ (35) పని చేస్తుంటాడు. పనులు ముగించుకుని బుధవారం రాత్రి బయటకు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ సమయంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా రోడ్డుపై పడిపోవడంతో అక్కడే సమీపంలో విధులు నిర్వహిస్తున్న బ్లూకోట్ కానిస్టేబుల్ (Bluecoat Constable) కిరణ్ (Kiran) వెంటనే స్పందించాడు. వంశీకి సీపీఆర్ (CPR) నిర్వహించాడు. దాదాపు 15 నిమిషాల పాటు అతడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాడు. సీపీఆర్ చేయడంతో వంశీ అపస్మారక స్థితి నుంచి తేరుకుని తిరిగి శ్వాస తీసుకున్నాడు. దీంతో స్థానికులంతా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం వెంటనే వంశీని ఎస్సై శ్రీకాంత్ రెడ్డి పోలీస్ వాహనంలో పరకాల ఆస్పత్రికి తరలించారు.
కాగా సీపీఆర్ విధానంపై తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం వందలాది మంది పోలీసులకు సీపీఆర్ విధానంపై శిక్షణనిచ్చారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (T Harish Rao), మరో మంత్రి కేటీఆర్ (KT Rama Rao)తో కలిసి ఈ శిక్షణను ప్రారంభించారు. ఇటీవల కాలంలో గుండె సమస్యలు (Heart Problems) పెరిగిపోతుండడంతో సీపీఆర్‌పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడంతో పాటు సడెన్ కార్డియాక్ అరెస్ట్ గురైన వారికి సకాలంలో సీపీఆర్ అందించే ఉద్దేశంతో శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రజలు కూడా సీపీఆర్ విధానంపై అవగాహన పెంచుకుని.. ఆపద సమయంలో ప్రయత్నం చేస్తే నిండు ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు.
కాగా ఫిబ్రవరి 24వ తేదీన హైదరాబాద్ (Hyderabad)లోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరాంఘర్ చౌరస్తాలో బాలరాజు అనే యువకుడు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) బస్సు కోసం వేచి చూస్తున్నాడు. చూస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా కింద పడిపోయాడు. అక్కడే ట్రాఫిక్ విధులు (Traffic) నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాజశేఖర్ అక్కడికి చేరుకున్నాడు. బాలరాజు పరిస్థితి చూసి వెంటనే ఎదపై బలంగా బాదడం మొదలుపెట్టాడు. ఊపిరి పీల్చుకునే విధంగా పలుమార్లు రెండు చేతులతో గట్టిగా నొక్కడంతో బాధితుడికి స్పృహ వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారు కానిస్టేబుల్ ను అభినందించారు. ఆ వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించి అతడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాజశేఖర్ ను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎంతో మంది ప్రశంసించారు. సీఐ తెలిపారు.