»Clashes In Revanth Reddy Hath Se Hath Jodo Yatra At Bhupalpally
Bhupalpally రేవంత్ యాత్రలో ఉద్రిక్తత.. కోడిగుడ్లు, టమాటాలు, సీసాలతో దాడి
దాడికి పాల్పడిన వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభపై దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నారు. నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకుని పోతా
తెలంగాణలో పీసీసీ (PCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన ఉద్రిక్తంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం (Jayashankar Bhupalpally District)లో నిర్వహించిన బహిరంగ సభపై కొందరు కోడిగుడ్లు, టమాటాలతో దాడికి పాల్పడ్డారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాళ్ల దాడి చేశారు. పరస్పర దాడులతో భూపాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘హాథ్ సే హాథ్ జోడో’ (Hath se Hath Jodo Yatra) యాత్రలో భాగంగా మంగళవారం భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగింపు కార్యక్రమం కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు.
ఈ పర్యటన ఆది నుంచి ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. ఉదయం ఫ్లెక్సీల (Flexi) విషయమై బీఆర్ఎస్ పార్టీ (BRS Party), కాంగ్రెస్ (Congress) కార్యకర్తల నడుమ వివాదం కొనసాగింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పోలీసులు రంగంలోకి ప్రవేశించి పరిస్థితులు చక్కబెట్టారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను స్థానిక ఊర్వశి థియేటర్ ఆవరణలో దిగ్బంధం చేశారు. అయితే సాయంత్రం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు హాజరైన సమయంలో అనూహ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లు సభ వైపు విసిరారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాళ్లు, సీసాలు విసిరారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. సాధారణ ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ దాడిలో ఇరు పార్టీల నాయకులు గాయపడ్డారు. పోలీసులు నివారించే క్రమంలో వారిపై కూడా దాడులు జరిగాయి. కాటారం ఎస్సై శ్రీనివాస్ తలకు గాయమైంది. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ కార్యకర్తలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అల్లర్లు చెలరేగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ దాడిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించాడు. మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి పార్టీ ఫిరాయించిన సన్నాసులకు గుణపాఠం చెప్పేందుకు యాత్ర చేపట్టా. దాడికి పాల్పడిన వారికి ఇదే నా హెచ్చరిక. వంద మందిని తీసుకొచ్చి మా సభపై దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నారు. నేను అనుకుంటే నీ థియేటర్ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకుని పోతా’ అని రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు హాజరయ్యారు. వాస్తవంగా ఈనెల 23న బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యాడు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ సభ కూడా నిర్వహించాల్సి ఉంది. పోలీసుల విజ్ణప్తితో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిబ్రవరి 28కి వాయిదా వేసుకున్నారు.