ఈ మధ్య కాలంలో ఊరు ఊరంతా కదిలేలా చేసిన సినిమా బలగం(Balagam). తెలంగాణ నేపథ్యంలో తక్కువ బడ్జెతో తెరకెక్కి.. బాక్సాఫీస్ దగ్గర బలగం చూపించిన ఈ సినిమా.. భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అంతేకాదు ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు రికార్డ్స్ స్థాయిలో టీఆర్పీ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
అసలు జబర్ధస్త్ కమెడియన్ వేణు యెల్దండి Balagam సినిమాను ఇంత ఎమోషనల్‌గా తెరకెక్కిస్తాడని ఎవరు ఊహించలేదు. వివి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్స్ కూడా వేణును ఆకాశానికెత్తేశారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఎమోషనల్ డ్రామగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఊరూరా ప్రొజెక్టర్, తెరలు ఏర్పాటు చేసి మరీ ప్రదర్శించారు.
అంటే సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఈ సినిమా 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే థియేటర్లో, ఓటిటిలో దుమ్ముదులిపేసిన బలగం.. బుల్లితెర రికార్డులను బద్దలు కొట్టేసింది. అంతేకాదు ఆస్కార్ విన్నింగ్ మూవీ ట్రిపుల్ ఆర్ రికార్డ్స్‌ను కూడా బద్దలు కొట్టింది. మే 7న ఈ చిత్రాన్ని స్టార్ మాలో టెలికాస్ట్ చేశారు.
థియేటర్లు, ఓటిటిలో మిస్ అయిన వారు బలగం సినిమా కోసం ఇళ్లకే టీవిలకు అతుక్కుపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 14.3 టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది బలగం. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రికార్డ్ రేటింగ్స్ వచ్చాయి.
ఒక్క హైదరాబాద్‌లోనే 22 టీఆర్పీని రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది బలగం. ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు అని అంటున్నారు. RRR మూవీ హైదరాబాద్‌లో 19 టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. కానీ బలగం ఆ రికార్డును బద్దలు చేసేసింది.