Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. అయితే ఈ యాత్రకు ఐదు రోజుల పాటు విరామం ఇవ్వనున్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్య సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్ ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ సమయంలో ఆయన బ్రిటన్ పర్యటన చేపట్టనున్నారు. అలాగే ఈ నెల 27, 28న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. యాత్రను మళ్లీ మార్చి 2న పున:ప్రారంభిస్తారని సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ గాంధీ మార్చి 5న సందర్శించనున్నారు.
తాజాగా రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2018లో మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాహుల్ కేంద్రమంత్రి అమిత్‌షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటామని చెప్పే బీజేపీ ఓ హత్య కేసులో నిందితుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుందని ఆరోపించారు. ఆ సమయంలో అమిత్ షా బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. దీంతో బీజేపీకి చెందిన విజయ్ మిశ్రా రాహుల్‌పై ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో ఫిర్యాదు చేశారు. గతంలో చాలాసార్లు న్యాయస్థానం రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. కానీ ఆయన స్పందించలేదు. తాజాగా విచారణకు హాజరవ్వగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.