పీజీ మెడికో డాక్టర్ ప్రీతి ఆత్మహత్య కేసు(medico preethi case)లో నిందితుడు డాక్టర్ మహ్మద్ సైఫ్(saif)కు వరంగల్ జిల్లా కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్(bail) మంజూరు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC)లో తన జూనియర్ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యలో సైఫ్ పాత్ర ఉందనే ఆరోపణలపై అతన్ని అరెస్టు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్య కేసు(Medico Preethi Case)లో నిందితుడు సైఫ్(saif) కు బెయిల్ మంజూరు చేశారు. షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేస్తూ… ఉమ్మడి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం తో పాటు వరంగల్ జిల్లా రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు నిందితుడు మూడుసార్లు బెయిల్(bail) ను దరఖాస్తు చేసుకోగా, న్యాయస్థానం కొట్టి వేస్తూ వచ్చింది.
నాలుగో సారి బెయిల్(bail) కోసం దరఖాస్తు చేసుకోవడంతో 10 వేల సొంత పూచీకత్తుతో పాటు అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. అంతే కాదు వీటితో పాటు చాలా షరతులనే కోర్టు విధించింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16 వారాల పాటు కేసు విచారణ అధికారి దగ్గర హాజరు కావాలి.
సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయవద్దు. అదే విధంగా మృతురాలి ఫ్యామిలీని బెదిరించే ప్రయత్నం చేయవద్దని న్యాయమూర్తి కండిషన్స్ పెట్టారు. ఇక న్యాయస్థానం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే అతని బెయిల్ రద్దు చేయాలని పోలీసులు(police) కోరవచ్చని కూడా ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది.